పుష్ప... పార్టీ షురూ చేసేదా! ‘పుష్ప’ మొదటి ప్రీమియర్ కు కౌంట్ డౌన్ షురూ అయ్యింది. మరికొద్ది గంటల్లో యుఎస్ లో ఫస్ట్ షో పడనున్న నేపథ్యంలో ‘ప్రీమియర్ టాక్’ ఎలా ఉంటుందా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. గతంలో అయితే యుఎస్ ప్రీమియర్స్ తో పాటు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా మిడ్ నైట్ షోలు గానీ, వేకువజామున షోలు గానీ పడేవి. కానీ ఈ సారి యుఎస్ నుండే ఫస్ట్ టాక్ వెలువడాల్సి ఉంటుంది.

ఇప్పటికే ప్రీమియర్స్ హాఫ్ మిలియన్ డాలర్స్ దాటిపోవడంతో, టాక్ గనుక పాజిటివ్ గా వస్తే, రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ఉంటాయి. యుఎస్ లో క్రిస్మస్ భారీ స్థాయిలో జరుగుతుంది గనుక, ఈ ఫెస్టివల్ హాలిడేస్ ‘పుష్ప’కు కలిసొచ్చే అంశం. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఎక్స్ ట్రా షోలకు పర్మిషన్స్ ఇచ్చేసారు, అలాగే టికెట్ ధరల పెంపుకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.

గత రెండు రోజులుగా హాట్ టాపిక్ గా మారిన ఏపీలో నేడు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టికెట్ ధరల పెంపును జాయింట్ కలెక్టర్ కు హైకోర్టు వదిలిపెట్టగా, ఏ ధియేటర్ ఓనర్లు అయితే కోర్ట్ లో పిటిషన్లు దాఖలు చేసారో వారికి మాత్రమే గతంలో ఉన్న టికెట్ ధరలను అమలు చేసుకునే విధంగా జాయింట్ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.

దీంతో కోర్టుకు వెళ్లిన 300 ధియేటర్ల యజమానులు ఊపిరి పీల్చుకున్నారు. మిగిలిన థియేటర్లన్నీ యధావిధిగా తక్కువ ధరలకే టికెట్స్ విక్రయించాల్సి ఉంటుంది. దీంతో ఏపీలో “పుష్ప” పార్టీ చేసుకునే సౌలభ్యం ధైర్యం చేసి కోర్టు మెట్లెక్కిన వారి వరకే పరిమితమైంది. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలకు ‘బ్లాక్ బస్టర్’ టాక్ వచ్చినా, ఏపీలో బయటపడడం కష్టమనే టాక్ నడుస్తోంది.

ఇక దేశవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదల అవుతుండడం ఊపిరి పీల్చుకునే విషయం. నేడు కూడా యుఎస్ ప్రీమియర్స్ మరియు ఇతర భాషల రిలీజ్ లపై సోషల్ మీడియాలో పుకార్లు చెలరేగినప్పటికీ, “పుష్ప” మాత్రం అనుకున్న సమయానికి విడుదల అవుతుండడం శుభపరిణామం. ఇక కావాల్సిందల్లా “బ్లాక్ బస్టర్” టాక్! అది వస్తే ఇండియా వ్యాప్తంగా “పుష్ప” పార్టీ షురూనే!