పుష్ప... 'ఫైర్' అనుకొంటివా... 'ఫ్లవర్..!'‘ఆర్య, ఆర్య 2’ తర్వాత సుకుమార్ – అల్లు అర్జున్ కాంభినేషన్ లో వస్తోన్న “పుష్ప” సినిమాపై సినీ పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. ‘తగ్గేదేలే’ అనే మేనరిజంతో ఇప్పటికే యూత్ లో ఓ సెన్సేషన్ సృష్టించిన “పుష్ప” ధియేటిరికల్ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. అనుకున్న సమయానికి తీసుకురాలేకపోయినప్పటికీ, ఫైనల్ గా అయిదు భాషల్లో విడుదలైన ట్రైలర్ ఎలా ఉంది? అంటే…

ఇతర భాషల సంగతి పక్కన పెడితే, తెలుగు “పుష్ప” ట్రైలర్ ప్రేక్షకులను ఉర్రూతలూగించడంలో కాసింత నిరుత్సాహ పరిచిందనే చెప్పాలి. ట్రైలర్ చూడగానే ‘సినిమా ఎప్పుడు వస్తుంది?’ అన్న ఆసక్తికి బదులు, ప్రేక్షకులు ఒకింత గందరగోళానికి గురవుతున్నారు. ఈ ట్రైలర్ కటింగ్ కోసమేనా ఇంత ఆలస్యం? అంటూ అభిమానులు, నెటిజన్లు వేస్తోన్న ప్రశ్నలు కోకొల్లలు.

“పుష్ప” రోల్ ను ఆవాహనం చేసుకోవడానికి, దానిని తెరమీద పండించడానికి అల్లు అర్జున్ చాలా కష్టపడి నటించినట్లుగా అనిపిస్తుంది. సాధారణంగా అల్లు అర్జున్ లో కనిపించే యాక్షన్ ఈజ్ ఇందులో మిస్ అవ్వడం అభిమానులకూ ఆందోళనకరంగా మారింది. ‘తగ్గేదేలే’ మేనరిజమ్ మాత్రమే బన్నీ మాత్రమే చేయగలడు అనిపించే విధంగా ఇప్పటివరకు చూపించిన అన్ని షాట్స్ లో పండింది.

దాదాపుగా రెండున్నర్ర నిముషాల పాటు సాగిన ట్రైలర్ లో కొత్తగా చెప్పుకోవడానికి ఉన్నదేమిటంటే… చివరలో బన్నీ చెప్పే డైలాగ్… ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకొంటివా, ఫైర్’ అన్న షాట్ అభిమానుల మెప్పును పొందుతోంది. విజువల్ గా, సాంకేతికత పరంగా అద్భుతంగా ఉన్న ఈ ట్రైలర్ లో ‘కంటెంట్’ కటింగ్ లోనే దర్శకుడు సుకుమార్ కంగారు పడినట్లుగా అనిపిస్తుంది.

ట్రైలర్ ఆశించినంత కిక్ ను ఇవ్వకపోవడంతో, ఈ సినిమా పబ్లిసిటీలో ఆఖరి అస్త్రమైన సమంత స్పెషల్ సాంగ్ కుర్రకారును ‘జిగేల్ రాణి’ మాదిరి ఊపేస్తుందేమో చూడాలి. బన్నీ – సుక్కులకు “హ్యాట్రిక్” సక్సెస్ ను ఈ “పుష్ప” తీసుకువస్తుందో లేదో తెలియాలంటే ఈ నెల 17వరకు వెయిట్ చేయాల్సిందే! సిల్వర్ స్క్రీన్ పైన అయినా ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా ప్రేక్షకులను ఈ “పుష్ప” అలరించాలని ఆశిద్దాం.