'పుష్ప' లేటెస్ట్ సీన్ లో తమిళ వాసన!రిలీజ్ టైంలో ఎడిటింగ్ లో తీసేసిన సన్నివేశాలను డిలీటెడ్ సీన్స్ రూపంలో యూట్యూబ్ లో విడుదల చేయడం చాలా రొటీన్ గా జరిగే విషయం. ఆ క్రమంలోనే తాజాగా “పుష్ప” నుండి కత్తెరించబడిన సన్నివేశాన్ని చిత్ర యూనిట్ కొత్త సంవత్సరం కానుకగా విడుదల చేసింది.

పుష్ప ఇంటికి వచ్చి అద్దె కట్టలేదని గొడవ చేస్తున్న వ్యక్తికి, అద్దె ఇచ్చేసిన తర్వాత ‘పుష్ప’ ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో చెప్పే విధంగా ఉన్న సీన్ బన్నీ అభిమానులను అలరిస్తోంది. ఊర్లో అందరి ముందు అవమానించి, డబ్బులు మాత్రమే కొంతమంది ముందే తీసుకుంటావా, అంటూ ప్రతి ఇంటికి అవమానించిన వ్యక్తిని తీసుకువెళ్తూ సుకుమార్ హీరోయిజాన్ని బాగానే ఎలివేట్ చేసారు.

అయితే చేతిలో బొగ్గు వేసుకుని పళ్ళు తోముకున్న అల్లు అర్జున్, తదుపరి సీన్ లో కాలకృత్యాలకు వెళ్లడం కూడా చూపించారు సుక్కు. తమిళ సినిమాలలో మాత్రమే ఇలాంటి ఊరమాస్ సీన్లను సహజంగా చూస్తుంటాం. క్లైమాక్స్ సీన్ లో బన్నీ – ఫాహిద్ లను న్యూడ్ గా చూపిస్తే మరీ ఊర మాస్ గా సీన్ మారిపోతుందేమోనని ఆ సీన్ విరమించుకున్నట్లుగా సుక్కు చెప్పిన సంగతి తెలిసిందే.

బహుశా ఈ సీన్ కూడా ఆ కోవలోనే కట్ చేసేసి ఉంటారు. అయితే ఇలాంటి సీన్స్ ను మన లెక్కల మాస్టారు తీయగలరా? అనిపించే విధంగా ఈ షాట్స్ ఉండడం విశేషం. ఈ సీన్స్ అన్ని కూడా తమిళ ప్రేక్షకులకు “పుష్ప”ను అత్యంత చేరువ చేసేందుకు అయితే ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మరీ కట్ చేసిన ఆ సీన్ పై మీరూ ఓ లుక్కేయండి!