పవన్ ఫ్యాన్స్ కోసం "పుష్ప" ఏమంటారో? “పుష్ప” నుండి విడుదలైన సమంత సాంగ్ ప్రేక్షక లోకాన్ని ఒక ఊపు ఊపుతున్న విషయం తెలిసిందే. యూట్యూబ్ రికార్డులను కైవసం చేసుకుంటున్న ఈ పాటను “పుష్ప” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఇందు కోసం ముంబై నుండి స్నేహ గుప్తా అనే డాన్సర్ కూడా స్పెషల్ గా దించబోతున్నారు.

ఆదివారం సాయంత్రం యూసఫ్ గూడ, పోలీస్ గ్రౌండ్స్ లో జరగబోతున్న ఈ ఈవెంట్ కోసం బన్నీ అభిమానులు ఎంతగానో నిరీక్షిస్తున్నారు. ట్రైలర్ ఇవ్వని కిక్ ను సమంత సాంగ్ ఇవ్వడంతో, ఉత్సాహంలో ఉన్న అభిమానులను మరింత ఉర్రూతలూగించేందుకు అల్లు అర్జున్ ఎలాంటి స్పీచ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి ‘జై బాలయ్య’ అంటూ నందమూరి అభిమానులను ఫ్లాట్ చేసిన బన్నీ, ఈ ఈవెంట్ లో పవర్ స్టార్ ఫ్యాన్స్ మళ్ళీ సందడి చేస్తే ఎలా బదులిస్తారు? అన్న ఆసక్తి మెగా అభిమానుల్లో నెలకొంది. ఓపెన్ గ్రౌండ్ కనుక అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది గనుక, ఈ ఈవెంట్ పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేం.

ముఖ్యంగా ‘అఖండ’లో బాలయ్య పేరు ప్రస్తావించడం సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యింది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఒకింత గుర్రుగా కూడా ఉన్నారు. బహుశా బన్నీ నోట నుండి ‘పుష్ప’ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ పేరు వస్తే, నందమూరి ఫ్యాన్స్ కు సోషల్ మీడియాలో మళ్ళీ పవన్ ఫ్యాన్స్ బదులిచ్చే అవకాశం ఉంటుంది.

దీంతో “పుష్ప” ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది సినిమా పబ్లిసిటీకి మించి పవర్ స్టార్ ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందోనని సినీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ‘చెప్పను బ్రదర్’ అన్న అల్లు అర్జున్ దానికే కట్టుబడి ‘తగ్గేదేలే’ అంటారా? లేక పవర్ స్టార్ ఫ్యాన్స్ తో కలిసిపోయి ‘తగ్గేదేలే’ అంటారా? ఏది ఏమైనా బన్నీ స్పీచ్ “పుష్ప” ఈవెంట్ లో అత్యంత ఆసక్తికరమైన అంశం.