‘చెప్పను బ్రదర్’ దగ్గర నుండి అల్లు అర్జున్ చేస్తోన్న ఏ స్పీచ్ అయినా సంచలనాలకు నిలయంగా మారుతోంది. ఒక రకంగా చెప్పాలంటే బన్నీ అటెండ్ అవుతోన్న సినీ వేడుకలు పబ్లిసిటీలకు నిలయంగా మారిపోతున్నాయి. దీంతో నేడు జరగబోతోన్న “అఖండ” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ బాబు ఎలాంటి స్పీచ్ తో మీడియా మొత్తాన్ని తన వైపుకు తిప్పుకుంటారో అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.

సాధారణంగా బాలకృష్ణ సినిమాకు సంబంధించిన కార్యక్రమం అంటే… బాలయ్యే హైలైట్ అవుతారు, అలా తెలుగు – సంస్కృతం మిళితం చేసి బాలయ్య ఇచ్చే స్పీచ్ లు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతాయి. అందుకు విరుద్ధంగా నేడు “అఖండ” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందేమో చూడాలి.

ముఖ్యమైన అంశం ఏమిటంటే… ఏపీలో టికెట్ ధరల అంశంలో ఈ ఇద్దరు హీరోలు ఏ విధంగా స్పందిస్తారు? అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ప్రభుత్వం అసెంబ్లీలో బిల్ ను పాస్ చేయడంతో వీరిద్దరి స్పందన అనివార్యం అయ్యింది. గతంలో పవన్, చిరంజీవిలు కూడా ఇలా సినీ వేడుకలలోనే ఏపీ సర్కార్ నిర్ణయాన్ని లేవనెత్తారు.

‘అఖండ’ రిలీజ్ అయిన రెండు వారాలకే ‘పుష్ప’ విడుదల కానుండడంతో, పవన్ మాదిరి అల్లు అర్జున్ ఫైర్ అవుతారా? లేక చిరు లాగా సామరస్య విజ్ఞప్తులు చేసుకుంటారా? అన్న ధోరణిలో ఇండస్ట్రీ వర్గాలు వేచి చూస్తున్నాయి. అలాగే వైసీపీ ప్రత్యర్థి పార్టీ కావడంతో, జగన్ తీసుకున్న నిర్ణయంపై బాలయ్య స్పందన కూడా అత్యంత కీలకం కానుంది.