My-Way-Or-High-Way-–-Allu-Arjun-Adamant“నా పేరు సూర్య” ఫలితం తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్న అల్లు అర్జున్, ఇప్పటివరకు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడు మొదలవుతుందా? ఎప్పుడు విడుదల అవుతుందా? అంటూ వేచిచూసే ఫ్యాన్స్ కు ప్రతిసారి “అతి త్వరలో” అని చెప్పడం స్టైలిష్ స్టార్ కు పరిపాటిగా మారిపోయింది.

ఇప్పటికే రెండు సార్లు ఇలా చెప్పుకొచ్చిన బన్నీ, తాజాగా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. మరికొద్ది రోజుల్లోనే తన కొత్త సినిమాకు సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా తెలియజేస్తామని అల్లు అర్జున్ చేసిన ట్వీట్ అభిమానుల సహనానికి పరీక్షగా మారింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పక్కా… అన్న టాక్ హల్చల్ చేస్తున్న నేపధ్యంలో… నేడు త్రివిక్రమ్ పుట్టినరోజు కం దీపావళి కావడంతో, ఈ రోజే ప్రకటన ఉంటుందని అభిమానులు ఆశించారు. కానీ అందుకు విరుద్ధంగా ‘అతి త్వరలో’ అంటూ మరోసారి పండగ కబురను అందించారు ఈ స్టైలిష్ స్టార్. లేటుగా వచ్చినా, ఈ సారి పక్కా హిట్టుతో రావాలన్న తాపత్రయమే ఈ ఆలస్యానికి కారణంగా చెప్తున్నారు.