We-Can't-Ban-Nagarjuna-RGV-Movie---Allu-Aravindవక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగానే సినీ విశ్లేషణలు కూడా వెలువడ్డాయి. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ఈ సినిమాపై డివైడ్ టాక్ తెప్పించేందుకు కుట్ర జరుగుతోందన్న భావాన్ని వ్యక్తపరిచిన వైనం తెలిసిందే. దీని గురించి నీకు తర్వాత చెప్తాను బన్నీ, నువ్వు ఆవేశపడకు, ఇందులో నువ్వు ఇన్వాల్వ్ కావద్దంటూ హితబోధ కూడా చేసారు.

ప్రస్తుతం సినిమా విడుదలై మూడు రోజులు పూర్తి చేసుకుంది. అల్లు అరవింద్ చెప్పినట్లుగానే సినిమాకు డివైడ్ టాక్ కంటే కూడా కాస్త ఎక్కువగానే నెగటివ్ టాక్ ప్రేక్షకుల నుండి వ్యక్తమయ్యింది. మరి ఈ ‘డివైడ్ టాక్’లో పాపం ఎవరిదీ? తమ అభిమాన హీరోను మొదటి రోజు మొదటి షోనే చూడాలని ఊవ్విళ్ళూరుతూ, ఎలాగైనా టికెట్ సంపాదించుకుని, నచ్చకపోతే నిర్మొహమాటంగా చెప్పే హీరో అభిమానులదా? లేక ఈ సినిమా చూసిన ఇతర ప్రేక్షకులదా? సినీ విశ్లేషణలు చేసిన వారిదా? ఇలా రకరకాల కోణాలలో అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

అపుడు పరోక్షంగా అల్లు అరవింద్ వ్యక్తం చేసిన అనుమానాలు ఎక్కువగా మీడియా ఛానల్స్ ను ఉద్దేశించే అన్న విషయం చర్చగా మారిన నేపధ్యంలో… అసలు మీడియా ఛానల్స్ లో ‘నా పేరు సూర్య’ గురించి ఏ రకమైన పబ్లిసిటీ లేకపోయింది. పాజిటివ్ సంగతి పక్కన పెడితే నెగటివ్ టాక్ వచ్చిందన్న విషయం కూడా మీడియా ఛానల్స్ ప్రసారం చేయలేదు. అయినప్పటికీ సినిమాపై ఇప్పటికీ అదే టాక్ కొనసాగుతోంది. అల్లు అర్జున్ అద్భుతంగా చేసాడని అందరూ ఎలా అయితే మెచ్చుకుంటున్నారో, కధలో ఉన్న కంటెంట్ విషయంలోనూ అలాగే విమర్శిస్తున్నారు.

ఇపుడు అల్లు అరవింద్ గారి వ్యాఖ్యల కోసం వెయిటింగ్! తెరవెనుక కుట్రలు పన్నింది ఎవరు? ఈ డివైడ్ టాక్ కు అసలు కారణం ఏమిటి? సక్సెస్ మీట్ లో అన్నీ చెప్తాను అని చెప్పారు, మరి ‘నా పేరు సూర్య’కు సక్సెస్ మీట్ పెట్టే ధైర్యం చేస్తారో? లేదో? చూడాలి. గతంలో ‘అత్తారింటికి దారేది’ సినిమా పైరసీ విషయంలో కూడా పవన్ ఇలాగే కొన్ని సంచలన ఆరోపణలు చేసి, త్వరలో బయటపెడతాను అంటూ చేసిన హంగామా తెలిసిందే. తాజాగా అల్లు అరవింద్! అయితే ఎప్పటికీ ఆ “తెరవెనుక” విషయాలు బయటకు రావు! ఇదంతా ఓ పబ్లిసిటీ గేమ్ అని ప్రేక్షకులు అర్ధం చేసుకోవాలేమో!?