Allu-Arjun---Naa-Peru-Suryaఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద “రంగస్థలం” సినిమాతో భారీ షాక్ ఇచ్చాడు రామ్ చరణ్. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఏకంగా ‘నాన్ బాహుబలి’ రికార్డును సృష్టించి, ట్రేడ్ వర్గాలను విస్మయపరిచాడు. యుఎస్ మార్కెట్ లో రామ్ చరణ్ సినిమాలకు పెద్దగా మార్కెట్ లేదన్న విషయం బహిరంగమే. కానీ ‘రంగస్థలం’తో ఆ మచ్చను చెరిపివేసి, ఏకంగా టాప్ 3లో పదిలంగా కూర్చున్నాడు. మరి బావ చేసిన పనినే బన్నీ కూడా రిపీట్ చేస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.

రామ్ చరణ్ మాదిరే బన్నీకి యుఎస్ లో పెద్దగా మార్కెట్ లేదు. ఇప్పటివరకు అల్లు అర్జున్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘రేసుగుర్రం’ 1.39 మిలియన్ డాలర్స్ తో ఉంది. ఆ తర్వాత స్థానంలో త్రివిక్రమ్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ 1.25 మిలియన్ డాలర్స్ నిలువగా, ‘దువ్వాడ జగన్నాధమ్’ 1.15 మిలియన్ డాలర్స్ తో ఏదో ‘మామా’ అనిపించాడు. ఏపీ, తెలంగాణాలలో రికార్డులు సృష్టించిన ‘సరైనోడు’ కనీసం 1 మిలియన్ కూడా చేరుకోలేకపోయిందంటే బన్నీ రేంజ్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అయితే ఈ “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” మీద అల్లు అర్జున్ తో పాటు, మెగా అభిమానులు ఎక్కువ ఆశలే పెట్టుకున్నారు. టాలీవుడ్ లో పెద్ద సినిమాలు సక్సెస్ ట్రెండ్ లో ఉండడం, బావ ఇప్పటికే యుఎస్ లో ‘నాన్ బాహుబలి’ రికార్డు కొట్టడం, ఆ తర్వాత స్థానంలో ‘భరత్ అనే నేను’ నిలవడం… ఇలా పాజిటివ్ ట్రెండ్స్ తో బన్నీ బొమ్మ కూడా యుఎస్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ మార్కెట్ మరింత పెరగాలంటే యుఎస్ బిజినెస్ చాలా కీలకం! మరి ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తాడో లేక తన పాత ట్రెండ్ ను కొనసాగిస్తాడో మరికొద్ది గంటల్లో తేలనుంది.