Allu arjun - Naa Peru Shuryaఒకప్పుడు సమ్మర్ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కావడం… అది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడం… అలా జరిగిపోతూ ఉండేది. “తొలిప్రేమ” నుండి “ఖుషీ” వరకు వరుసగా సమ్మర్లో మాత్రమే పవన్ సినిమాలు విడుదలయ్యేవి, ఆశించిన సక్సెస్ లను అందుకునేవి. ‘ఖుషీ’ తర్వాత సక్సెస్ అనేది మరిచిపోయిన పవన్ కు మళ్ళీ అంతటి భారీ హిట్ ను అందించిన ‘గబ్బర్ సింగ్’ కూడా సమ్మర్ సెన్సేషన్ గా విడుదలై చిత్రమే. అయితే పవన్ కు బాగా కలిసొచ్చిన సమ్మర్ సెంటిమెంట్ ను గత మూడేళ్ళుగా అల్లు అర్జున్ అనుకూలంగా మలుచుకున్నాడు.

‘సన్నాఫ్ సత్యమూర్తి, రేసుగుర్రం, సరైనోడు’ వంటి సినిమాలతో వరుసగా సమ్మర్ సక్సెస్ లు అందుకున్న అల్లు అర్జున్, ఈ ఏడాది మాత్రం సమ్మర్ సీజన్ దాటిన తర్వాత ‘దువ్వాడ జగన్నాధమ్’ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిర్మాత, దర్శకుడు, హీరోల లెక్కల ప్రకారం ‘బ్లాక్ బస్టర్’ విజయంగా చెప్తున్నారు గానీ, ట్రేడ్ టాక్ ప్రకారం ‘డీజే’ బన్నీ పరాజయాల ఖాతాలోకి వెళ్ళిపోయిందని టాక్. సమ్మర్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయడం వలన సక్సెస్ లకు పడిన బ్రేక్ ను, మళ్ళీ అదే సమ్మర్ తో అందుకునేందుకు అల్లు అర్జున్ “నా పేరు సూర్య” ద్వారా సిద్ధమవుతున్నాడు.

వక్కంతం వంశీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను ఏప్రిల్ 27వ తేదీన సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయనున్నామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించేసారు. సాధారణంగా పూరీ జగన్నాధ్ మాత్రమే ఇలా సినిమా ప్రారంభం రోజునే విడుదల తేదీని ప్రకటించడం, ఆ తేదీ కంటే ముందుగానే సినిమాను సిద్ధం చేయడం జరుగుతూ ఉంటుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆ జాబితాలోకి వక్కంతం వంశీ కూడా చేరనున్నాడు. ఇంకా 8 నెలల సమయం ఉంది కాబట్టి, అనుకున్న సమయానికి రావడం “నా పేరు సూర్య” చిత్ర యూనిట్ కు పెద్ద కష్టమైన పనేమీ కాకపోవచ్చు.