Allu-Arjun-In-Pushpa-Part1సుకుమార్ చెక్కుతున్న “పుష్ప” విడుదలకు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఫైనల్ కాపీని రెడీ విషయంలో దర్శకుడు సుకుమార్ తలమునకలవ్వగా, అల్లు అర్జున్ – రష్మికలతో కూడిన ఇంటర్వ్యూను రిలీజ్ చేసి అభిమానులను ఉత్సాహపరిచే ప్రయత్నం చిత్ర యూనిట్ చేసింది.

‘మీ డెడికేషన్ కు హ్యాట్సాఫ్, అమ్మ బాబోయ్ ఏమి మేకప్’ అంటూ ప్రారంభించిన యాంకర్ సుమకు అల్లు అర్జున్ కూడా అదే రియాక్షన్ ఇచ్చారు. ‘అమ్మ బాబోయ్… నాక్కూడా చాలు బాబోయ్, ఒకటి, రెండు సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నా వల్ల కాదంటూ’ బన్నీ నవ్వుతూ చెప్పేసారు.

నిజంగా ఈ సినిమా కోసం నాలుగు సినిమాల కష్టాన్ని పడ్డామని, ఇదేదో తాను ఎక్కువ చేసి చెప్పడం లేదని, నిజంగా అంత శ్రమ పడ్డామని, రోజుకు రెండున్నర్ర గంటల పాటు మేకప్ వేసుకోవడం, మళ్ళీ ఆ మేకప్ తీయడానికి అరగంట పట్టేదని బన్నీ చెప్పగా, తన మేకప్ తీయడానికి అయితే ఏకంగా రెండు గంటలు పట్టేదని రష్మిక చెప్పుకొచ్చింది.

ఈ సినిమా లొకేషన్స్ కు వెళ్ళడానికి అడవిలో దారులు కూడా లేవని, దానిని వేసుకుంటూ దాదాపుగా ప్రొడక్షన్ యూనిట్ లో రోజుకు 500 నుండి 600 మంది పని చేసేవారని, మా వెహికల్స్ ఓ 250 ఉండేవని, మీరు చూసేటప్పుడు స్క్రీన్ పైన మా కష్టం తెలియకపోవచ్చు గానీ, అంత శ్రమ “పుష్ప” కోసం పడినట్లుగా అల్లు అర్జున్ తెలిపారు.

ఈ సినిమాకు హీరోకు ఏదొక స్పెషల్ పెట్టాలని సుకుమార్ భావించినప్పుడు, మేమిద్దరం కలిసి భుజాన్ని అలా ఉంచే విధంగా నిర్ణయం తీసుకున్నామని, దాని పర్ ఫెక్షన్ కోసం చాలా కష్టపడ్డామని, డైలాగ్ చెప్తుంటే ఓ విధంగా, ఫైట్ సీక్వెన్స్ లో ఓ విధంగా, పాటలలో ఇంకో విధంగా ఇలా కొన్నాళ్ళకు నా భుజానికి తలకు మధ్య దూరం తగ్గిపోయిందని, తర్వాత ఫీజియోథెరపిస్ట్ ద్వారా నార్మల్ అయ్యిందని అన్నారు.

అల్లు అర్జున్ చెప్తోన్న మాటలు ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో సూచిస్తోంది. ఉదయం నాలుగు గంటలకు లేచి, సాయంత్రం అయిదు గంటల వరకు ఏ మాత్రం సదుపాయాలు లేని అడవిలో షూట్ చేయడం, అందులోనూ పర్ ఫెక్షన్ కోసం ప్రతి షాట్ లోనూ భుజాన్ని మార్చి మార్చి అలా ఉంచడం చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. బహుశా బన్నీలో ఈ కసి చూసే సుకుమార్ “పుష్ప రాజ్”ను ఎంపిక చేశారేమో!

ఇక రష్మిక ప్రశ్నిస్తూ… ఓ వైపు సుకుమార్ లెక్కల మాస్టర్, మరో వైపు సూపర్ డాన్సర్ అల్లు అర్జున్… వీరిద్దరితో వర్క్ చేయడం ఎలా అనిపించిందని ప్రశ్నించే క్రమంలో… ఏంటి డాన్స్ యేనా, యాక్టింగ్ రాదా నాకు? అంటూ ఛలోక్తి విసిరారు బన్నీ. ఈ సినిమాలో రష్మిక చాలా అద్భుతంగా నటించిందని ప్రశంసలు కురిపించారు ఐకాన్ స్టార్.

ఈ సినిమా రెండో పార్ట్ కు ఇంకా పేరు నిర్ణయించలేదని, బహుశా సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు ఏదైనా పేరును ప్రపోజ్ చేస్తే అదైనా పెడతామని, “పుష్ప” అనేది కామన్ అని, దాని క్రింద కాప్షన్ మాత్రం మారుతుందని, హ్యాష్ టాగ్ పెట్టి ఓ మంచి టైటిల్ సూచనలు చేయాల్సిందిగా ప్రేక్షకులను కోరారు స్టైలిష్ స్టార్.