Allu Arjun, Ala Vaikunthapurramuloo hindi releaseబాలీవుడ్ లో “పుష్ప” బ్రహ్మాండమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అంచనాలకు మించిన ఆదరణతో “పుష్ప” టీమ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. ఈ ఉత్సాహంతో ‘పుష్ప 2’ను భారీ స్థాయిలో విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటనలు కూడా ఇచ్చేసారు. 10 కోట్లు కూడా వస్తుందో లేదోనని విడుదల చేసిన సినిమా ఏకంగా 90 కోట్లు కొల్లగొట్టడంతో ఏర్పడిన నమ్మకం ఇది.

అల్లు అర్జున్ స్టార్ డం, స్టామినాను పెంచిన సినిమాగా “పుష్ప” నిలబడింది. దీంతో బన్నీ నటించిన గత చిత్రాలను హిందీలో డబ్ చేసి ధియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా త్రివిక్రమ్ కాంబోలో బన్నీ నటించిన మునుపటి మూవీ “అలా వైకుంఠపురంలో” జనవరి 26వ తేదీన బాలీవుడ్ లో విడుదల చేయబోతున్నారు.

ఈ లేటెస్ట్ రిలీజ్ లో బన్నీ ప్రమేయం ఎంత ఉందన్నది పక్కన పెడితే, ఈ ప్లానింగ్ వర్కౌట్ అయితే పర్లేదు గానీ, లేదంటే ‘పుష్ప’తో అల్లు అర్జున్ కు వచ్చిన సూపర్ ఇమేజ్ ను చెడగొట్టిన వారవుతారు. ‘పుష్ప’ అనేది ఓ ప్రత్యేకమైన సినిమా. ఈ సినిమాకు వచ్చిన ఆదరణతో బన్నీ నటించిన అన్ని సినిమాలకు అలాగే స్పందన వస్తుందనుకుంటే పప్పులో కాలేసినట్లే!

ఇలాగే తెలుగు నాట ఎందరో హీరోల అనుభవాలు ఉదాహరణగా నిలుస్తాయి. సూర్య “గజినీ” హిట్ తర్వాత వచ్చిన సినిమాల ఫలితాలు తెలిసిందే. ‘బిచ్చగాడు’ తర్వాత విజయ్ ఆంటోనీ సినిమాలు, ‘తుపాకీ’ తర్వాత విజయ్ మూవీస్, ‘యుగానికొక్కడు’ తర్వాత కార్తీ సినిమాలు, ‘పందెం కోడి’ తర్వాత విశాల్ సినిమాలు… ఇలా ఏ ఒక్క హీరో కూడా దీనికి అతీతులు కారు.

ఒక్క సినిమా హిట్ అయ్యిందని, అంతకుముందు నటించిన ఆయా హీరోల సినిమాలను డబ్బింగ్ రూపంలో తీసుకు రావడం అనేది తెలుగు సినిమా నిర్మాతలు అనుసరించేవారు. అయితే ఆ ఒరవడి ప్రేక్షకుల సహనానికి కారణం అవ్వడమే గాక, ఆయా హీరోల ఇమేజ్ ను ప్రేక్షకుల దృష్టిలో డామేజ్ చేసాయి. మార్కెట్ పెంచుకునే కోణంలో తప్పటడుగులు వేయడం హీరోలకు కూడా సహజమైపోయింది.

అయితే ఈ విషయంలో ప్రభాస్ మాత్రం మినహాయింపు. “బాహుబలి” రెండు సిరీస్ లతో వచ్చిన అశేషమైన ఇమేజ్ తో ప్రభాస్ గత చిత్రాలను డబ్బింగ్ చేయడం జరగలేదు. దీంతో ప్రభాస్ ఇమేజ్ కు ఎక్కడా డామేజ్ కాలేదు. అందుకే “సాహో” సినిమా సక్సెస్ కాకపోయినా, కలెక్షన్స్ కు డోఖా లేకుండా పోయింది. ఇదే విషయాన్ని బన్నీ కూడా అనుసరిస్తే, ‘పుష్ప’తో వచ్చిన స్టార్ డం ‘పుష్ప 2’ని నిలబెట్టే విధంగా ఉంటుందని గుర్తించాలి.

https://pbs.twimg.com/media/FJR5T5jaIAEfmtr?format=jpg&name=large