ఇవాళ ఉదయం నుంచి అల్లు అరవింద్ నిర్వహించబోయే ప్రెస్ మీట్ తాలూకు వార్తతో రెగ్యులర్ మీడియానే కాదు ట్విట్టర్ సైతం అట్టుడికిపోయింది. సాయంత్రం వచ్చేలోగా అది రద్దు చేయడంతో బోలెడు అనుమానాలు తలెత్తాయి. నిన్న నిర్మాత దిల్ రాజు దర్శకుడు పరశురామ్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ప్రకటించిన ప్రాజెక్టు అల్లు ఆగ్రహానికి గురైందనే వార్త గుప్పుమని వైరలయిపోయింది. గీత గోవిందం బ్లాక్ బస్టర్ తర్వాత అదే టీమ్ తో అరవింద్ మరో సినిమాని ప్లాన్ చేశారని దాని కోసం డైరెక్టర్ కి హీరోకి అడ్వాన్స్ కూడా ఇచ్చారని ఏవేవో వెర్షన్లు వినిపించాయి.
తన చేతుల్లో నుంచి దిల్ రాజు లాగేసుకున్నారని అందుకే మీటింగ్ లో అల్లు అరవింద్ నిలదీస్తారని అన్నారు కానీ ఇలా వినిపించినదంతా నిజం కాదని తెలుస్తోంది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సక్సెస్ ల తర్వాత విజయ్ దగ్గరకు ఎందరో నిర్మాతలు అడ్వాన్సులు ఇవ్వడానికి వచ్చిన మాట వాస్తవం. ఇది అందరికీ జరిగేదే. అయితే ఒక్క దిల్ రాజుకు మాత్రమే రౌడీ హీరో కమిట్ మెంట్ ఇచ్చి ముందస్తుగా కొంత మొత్తం తీసుకున్నాడు. ఇది జరిగి మూడేళ్లు దాటేసింది.
దీన్ని పట్టాలు ఎక్కించడానికి కథలు దర్శకులను పంపిన దిల్ రాజుకు ఒక్క పరశురామ్ విషయంలో మాత్రమే విజయ్ దేవరకొండ నుంచి సానుకూల స్పందన వచ్చింది. అందుకే లాక్ చేసుకుని అనౌన్స్ చేశారు. ఇదంతా హీరో వైపు నుంచి వినిపిస్తున్న వెర్షన్. అయితే సోషల్ మీడియాలో కొందరు విజయ్ ఇద్దరి దగ్గర అడ్వాన్సులు తీసుకుని అనైతికంగా మాట మార్చాడని ఎలాంటి ఆధారం లేని వాదన తీసుకొచ్చారు. కానీ వాస్తవం వేరు. తాను కేవలం దిల్ రాజు దగ్గర మాత్రమే అడ్వాన్స్ తీసుకున్నాను కాబట్టి దానికి మాత్రమే జవాబుదారీగా ఉంటాను తప్ప మిగిలిన విషయాలకు నన్నెలా బాధ్యుణ్ణి చేస్తారనేది విజయ్ దేవరకొండ లాజిక్.
ఒకవేళ పరశురామ్ గతంలో అల్లు అరవింద్ దగ్గర ఏమైనా అడ్వాన్స్ తీసుకున్నారా లేదానేది పక్కాగా ఎవరికి తెలియదు. అజాత శత్రువుగా పేరున్న అరవింద్ గతంలో ఎప్పుడూ ఆఘమేఘాల మీద ఒక సీరియస్ ఇష్యూ మీద ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు. అందులోనూ మీడియాతో జాగ్రత్తగా మాట్లాడే మనిషాయన. అలాంటి వ్యక్తి సినిమా ప్రమోషన్ కాకుండా ఒక్కరే మీటింగ్ పెట్టడం అందుకే టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. మొత్తానికి మంచి ట్విస్టులున్న స్టోరీని మించిన కంటెంట్ ఇవాళ ఈ ఎపిసోడ్ తో వచ్చిన మాట వాస్తవం