allu-aravind-raabta-movie-copyright-controversyజూన్ 9వ తేదీన విడుదల కాబోతున్న సుశాంత్ సింగ్, కృతిసనన్ ల “రాబ్తా” సినిమాకు టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బ్రేకులు వేసారు. గీత ఆర్ట్స్ పతాకంపై రామ్ చరణ్, కాజల్ జంటగా రాజమౌళి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన “మగధీర” సినిమాకు ‘ఫ్రీమేక్’గా “రాబ్తా” నిర్మించారన్న ఆరోపణలతో విడుదలను నిలిపి వేయాల్సిందిగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, తదుపరి విచారణను జూన్ 1వ తేదీకి వాయిదా వేసారు.

వాస్తవానికి “రాబ్తా” సినిమా అనేది ‘మగధీర’ రీమేక్ అన్న విషయం, నెల ముందే విడుదలైన ధియేటిరికల్ ట్రైలర్ స్పష్టం చేసింది. అయితే అల్లు అరవింద్ నుండి ఎలాంటి హక్కులు తీసుకోకుండా ఈ సినిమాను తెరకెక్కించడంతో విషయం వివాదాస్పదమైంది. కానీ ఇక్కడ ‘రాబ్తా’ నిర్మాణ సంస్థ అల్లు అరవింద్ ను తక్కువగా అంచనా వేసినట్లు కనపడుతోంది. ఎలాంటి రీమేక్ హక్కులు తీసుకోకుండా సినిమాను తెరకెక్కించి విడుదల చేస్తూ ఉంటే, అల్లు అరవింద్ అలా చూస్తూ ఉంటారనుకోవడం సదరు నిర్మాతల భ్రమగానే భావించవచ్చు.

అయితే ఎక్కడ, ఎప్పుడు ఎలా నొక్కాలో నేర్పరి అయిన అరవింద్, సరిగ్గా సినిమా విడుదల దగ్గరికి వచ్చే సరికి కోర్టులో పిటిషన్ వేయడంతో, ఇపుడు ‘రాబ్తా’ చిత్ర యూనిట్ ఎటూ పాలుపోలేని పరిస్థితిలో పడిపోయింది. దీంతో వారి ముందు రెండే ఆప్షన్స్ కనపడుతున్నాయి. ఒకటి… తెరవెనుక సైలెంట్ గా అల్లు అరవింద్ తో చర్చలు జరిపి, రీమేక్ హక్కులను పొందడం, రెండు… చట్టపరంగా పోరాటం చేయడం… అయితే రెండవది చేసినా, ‘రాబ్తా’ యూనిట్ కు ఇబ్బందుకు తప్పకపోవచ్చు.

ఒకవేళ మొదటి ఆప్షన్ కు వెళితే మాత్రం ‘రాబ్తా’ యూనిట్ కు పట్టపగలే చుక్కలు కనపడడం ఖాయంగా ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే… ‘మగధీర’ రీమేక్ అన్నది ఎప్పటి నుండో వార్తల్లో ఉన్న విషయం. అందులోనూ ‘బాహుబలి’ సినిమా తర్వాత రాజమౌళి సినిమాలకున్న క్రేజ్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మగధీర’ హక్కులకు భారీ మొత్తం వచ్చే అవకాశం ఉన్నందున, అల్లు అరవింద్ పెట్టిన మెలికతో గిలగిలలాడం సదరు నిర్మాతల వంతవుతోంది.