roja-mla-anithaచిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే సభ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్ కు గురైన రోజాకు ఎమ్మెల్యే హోదాలో అందుతున్న అలవెన్సులను కూడా నిలిపివేయాలని ప్రివిలేజ్ కమిటీ శాసనసభకు సిఫారసు చేసింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం సభకు కమిటీ తన నివేదికను అందజేసింది. టీడీపీ ఎమ్మెల్యే అనితపై రోజా చేసిన వ్యాఖ్యలు సభా నియమాలకు విఘాతమేనని తేల్చి చెప్పిన కమిటీ, రోజాపై సస్పెన్షన్ సరైనదేనని చెప్పింది.

అంతే కాకుండా ఇప్పటిదాకా రోజాకు అందుతున్న అలవెన్సులను నిలిపివేసి కఠినంగా వ్యవహరించాల్సిందేనని కమిటీ సిఫారసు చేసింది. తమ ముందు హాజరుకావాలన్న నాలుగు నోటీసులకు రోజా అసలు స్పందించలేదని కూడా కమిటీ పేర్కొంది. ఇక సభలో ఘాటు వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత, కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి కొడాలి నానిపై చర్యల విషయాన్ని శాసనసభకే వదిలేస్తూ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కొడాలిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న విషయం ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే… తప్పు ఒప్పుకున్న మరో ముగ్గురు జ్యోతుల నెహ్రూ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు తమ ముందు విచారణకు హాజరై క్షమాపణలు చెప్పారని, భవిష్యత్తులో సభా నియమాలకు అనుగుణంగానే నడుచుకుంటామని హామీ ఇచ్చారని తెలిపడంతో, వారిపై చర్యలు అవసరం లేదని సభకు సూచించింది.