Allegations on Chandrababu Naidu Personal Secretary failed to proveటీడీపీ ఎక్కే రైలు ఒక జీవితకాలం లేటు అన్నట్టు ఉంది ఆ పార్టీ వరస. మూడు రోజుల పాటు కొన్ని మీడియా సంస్థలు… చంద్రబాబు మాజీ పర్సనల్ సెక్రటరీ దగ్గర 2000 కోట్లు దొరికాయంటూ పనిగట్టుకుని విషం కక్కుతుంటే ఎట్టకేలకు ఆ పార్టీ మేలుకుంది. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఐటీ దాడుల్లో పట్టుబడిన సొమ్ము వివరాలు పేర్కొన్న పంచనామా నివేదిక విడుదల చేసారు.

ఆ దాడులలో దొరికింది కేవలం రూ.2.63 లక్షల నగదు, 12 తులాల బంగారం అని దానిలో ఉంది. అది కూడా తన కూతురి పెళ్లి సందర్భంగా ఉంచుకున్న రొక్కం, బంగారం అని ఆయన చెప్పుకున్నారని సమాచారం. ఆ పంచనామా పై దాడి చేసి అధికారి సంతకం ఉండటంతో 2 వేల కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని తేలిపోయింది.

దొరికిన సొమ్ము, బంగారం కూడా స్వాధీనం చేసుకోకుండా తిరిగి ఇచ్చేయడం కొసమెరుపు. అయితే మూడు రోజుల పాటు ఒక సెక్షన్ అఫ్ మీడియా వరుస కథనాలతో ముంచెత్తినా టీడీపీ చాలా ఆలస్యంగా వీటిని బయటపెట్టడం పార్టీ అభిమానులకు మింగుడుపడటం లేదు.

ఇప్పటికైనా సాక్షి మొదలైన మీడియా సంస్థలపై పరువునష్టం దావా వెయ్యాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సాక్షి పత్రిక ఈరోజు కూడా చంద్రబాబు అవినీతి చక్రవర్తి అంటూ ఒక వ్యాసం ప్రచురించడం విశేషం. మరి దీనిపై తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి.