Allari Naresh Ugramచిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి హీరోకి ఒక నిర్దిష్టమైన జానర్ ఉంటుంది. అవి దాటి బయటికి వచ్చి ప్రయోగాలు చేయాలని చూస్తే దెబ్బ తినే రిస్క్ లేకపోలేదు. చిరంజీవి కెరీర్ పీక్స్ ఉన్న టైంలో రుద్రవీణ చేస్తే వర్కౌట్ అవ్వలేదు. బాలకృష్ణకు జననీ జన్మభూమి, నాగార్జునకు జైత్రయాత్ర, వెంకటేష్ కు చిన్నబ్బాయి ఇలా చాలానే ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్లో ఇంత రిస్కులు పెద్దగా ఎవరు చేయలేదు. హిట్టో ఫ్లాపో కమర్షియల్ సూత్రాలకు కట్టుబడి మార్కెట్ డిమాండ్లకు అనుగుణంగా సినిమాలు చేసుకుంటూ వచ్చారు.

కామెడీ హీరోల కేసు వేరు. సంవత్సరాల తరబడి వాళ్ళను నవ్వించే పాత్రల్లో చూసి చూసి బాగా అలవాటు పడిపోయాక హఠాత్తుగా ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తే ఒక్కోసారి రివర్స్ అవుతుంది. ఒక్కోసారి అద్భుత ఫలితాలను ఇస్తుంది. నట కిరిటీ రాజేంద్రప్రసాద్ మంచి జోరుమీదున్న టైంలో ఎర్ర మందారం లాంటివి చేస్తే సక్సెస్ లే కాదు అవార్డులు రివార్డులు దక్కాయి. అలాంటివే కొనసాగించలేదు కానీ తరచుగా చేయడం మానుకోలేదు. ఆ నలుగురుతో మొదలుపెట్టి అనుకోని ప్రయాణం దాకా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నాయి.

ఇంకోవైపు చూస్తే రంగమార్తాండలో ఎంత గొప్పగా పెర్ఫార్మ్ చేసినా బ్రహ్మానందంని గుండె తడి చేసే క్యారెక్టర్ లో జనం రిసీవ్ చేసుకోలేకపోయారు. అల్లరి నరేష్ ఇప్పుడు ఉగ్రంతో రాబోతున్నాడు. ఒకప్పుడు నాన్ స్టాప్ గా అల్లరోడు అంటేనే మినిమం ఎంటర్ టైన్మెంట్ అనే గ్యారెంటీ నుంచి మార్కెట్ కోల్పోయే ప్రమాదం దాకా వచ్చాడు. మహర్షి పునాది వేసింది. నాంది ఊపిరి పోసింది. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఫ్లాపయినా తనకు మచ్చ రాకుండా నిలబెట్టింది. అందుకే ఉగ్రంలో మరింత వైల్డ్ గా మారిపోయాడు.

ఫలితం ఎలాగూ శుక్రవారం తేలిపోతుంది. టీవీలో యూట్యూబ్ లో ఉచితంగా జబర్దస్త్ లాంటి షోలు చూశాక మాములు జోకులకు జనం పెద్దగా నవ్వడం లేదు . అల్లరి నరేష్ కి ఎన్నో సినిమాలు మిస్ ఫైర్ అవ్వడానికి కారణం ఇదే. సుడిగాడులో స్పూఫ్ కామెడీని ఇప్పుడు ఆస్వాదించడం కష్టం. అందుకే పూర్తిగా రూటు మార్చుకున్నాడు. తనమీదున్న సాఫ్ట్ కార్నర్ ఎంతమేరకు ఓపెనింగ్స్ తెస్తుందనేది పక్కనపెడితే టాక్ బాగుంటే మాత్రం నిర్మాతలను నిలబెట్టగలిగే రేంజ్ అయితే తనకుంది. చూడాలి మరి ఏం చేయనున్నాడో.