Alla Ramakrishna Reddyప్రజావేదిక కూల్చివేత పనులను బుధవారం ఉదయం పరిశీలించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రజావేదిక కూల్చివేతపై సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారని చెప్పుకొచ్చారు. కరకట్ట మీద 60కి పైగా ఖరీదైన భవనాలు ఉన్నాయని, వాటన్నిటికీ నోటీసులు ఇప్పించినట్లు తెలిపారు. వీటి మీద తాను 2016లో వేసిన కేసులు ఈనెల 21న న్యాయస్థానం ముందుకు రావాల్సి ఉండగా.. చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్‌ చేశారని ఆరోపించారు.

ప్రజావేదిక పక్కన ఉన్న ఇంట్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండటం అన్యాయమని, ప్రజావేదిక కూల్చివేత తర్వాతైనా తక్షణమే ఖాళీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. చంద్రబాబును తాను వదిలిపెట్టనని స్పష్టం చేశారు. మిగిలిన వాళ్లు తామంతట తాము ఖాళీ చేస్తే మంచిదని, జగన్‌కి ఉన్న మంచి మనసును అంతా గుర్తించాలని, కక్షసాధింపు అయితే కూల్చివేత చంద్రబాబు ఉంటున్న ఇంటి నుండే మొదలు అయ్యేదని ఆయన చెప్పుకొచ్చారు.

అధికారంలో లేకపోయినా, టీడీపీ చంద్రబాబు చరిత్ర ముగిసిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ నుండి బీజేపీ దాకా అంతా అంటున్నా చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్‌ చెయ్యగల్గుతున్నారు అంటే విశేషమే. దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలతో కట్టిన ప్రజావేదిక కాల్చివేత మరి కాసేపట్లో పూర్తి కాబోతుంది. మంగళవారం సాయంత్రం కలెక్టర్ల సమావేశం ముగిసిన వెంటనే అందుకు తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు భవనంలోని ఫర్నిచర్‌ను, ఏసీలను ఇతర ప్రాంతాలకు తరలించి కూల్చివేత మొదలుపెట్టారు.