Andhra Pradesh Jagan-Mohan-Reddy ఓమిక్రాన్ రూపంలో కరోనా దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోన్న విషయం తెలిసిందే. ఒక్క రోజే 90 వేల కేసులు నమోదు కావడంతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలను చేపట్టింది. దక్షిణ భారత దేశంలో అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాలు కరోనా నిబంధనలను అమలు చేస్తున్నాయి.

ముందుగా పొరుగున తెలంగాణ విషయానికి వస్తే… లాక్ డౌన్ ఉండదని ఇప్పటికే స్పష్టత ఇచ్చినప్పటికీ, పెరుగుతున్న కేసుల రీత్యా అన్ని రాజకీయ సభలు, సమావేశాలు, ఇతర బహిరంగ సమూహాలపై జనవరి 10వ తేదీ వరకు నిషేధం విధించింది. ఇవే నిబంధనలు అన్ని కుల, మత కార్యక్రమాలకు కూడా వర్తిస్తాయి. నైట్ కర్ఫ్యూ, 50% ఆక్యుపెన్సీ లాంటి చర్యలకు ఇంకా శ్రీకారం చుట్టలేదు గానీ, వాటికి ఇంకెంతో దూరం లేదు అనే విధంగా కేసులు నమోదవుతున్నాయి.

ఇక తమిళనాడు సంగతి అయితే ఆదివారం నాడు లాక్ డౌన్ ను ప్రకటించి ఉన్నారు. అలాగే సాధారణ రోజులలో రాత్రి 10 నుండి వేకువజామున 5 వరకు నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ రవాణా అయిన ఆర్టీసీ, మెట్రోలలో 50% ప్రయాణించేలా, షాపింగ్ మాల్స్, షాపులు, రెస్టారెంట్లు 50% నిబంధనలు అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. శుక్ర, శని, ఆదివారాలలో అన్ని మతాల దేవాలయాలను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దక్షిణాదిలో తొలుత నైట్ కర్ఫ్యూను ప్రకటించిన రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. రాత్రి కర్ఫ్యూ 10 నుండి 5 వరకు అమలులో ఉండగా, దానిని మరో రెండు వారాలు పెంచారు. స్కూల్స్ లో నర్సరీ నుండి 9వ తరగతి క్లాసులకు కేవలం ఆన్ లైన్ మాత్రం అనుమతులు ఇచ్చింది. అలాగే ధియేటర్, రెస్టారెంట్ వంటి అన్ని బహిరంగ ప్రదేశాలలో 50% కరోనా నిబంధనలు అమలులోకి వచ్చాయి. రాజకీయ సభలు, నిరసనలపై నిషేధం ఉంది. బోర్డర్స్ లో నిఘాను కట్టుదిట్టం చేసింది.

ఇండియాలో తొలి కరోనా కేసు నమోదైన కేరళలో ఉధృత రూపం దాల్చనప్పటికీ, ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా నైట్ కర్ఫ్యూను అమలు చేసారు. అలాగే వివాహా తదితర వేడుకలకు సంబంధించి అవుట్ డోర్ అయితే 150 మందికి, ఇన్ డోర్ అయితే 75 మంది మాత్రమే పాల్గొని జరుపుకోవాలని నియమాలు పెట్టారు.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే… మాస్క్ తప్పనిసరి అన్న నిబంధన మినహా ఎలాంటి కరోనా ఆంక్షలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోంది. పొరుగున ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే కరోనా నియంత్రణలో ఉన్న మాట వాస్తవమే అయినా, ముందస్తు జాగ్రత్త చర్యలు మాత్రం చేపట్టడం లేదు. కరోనా సెకండా వేవ్ లో ఏపీలో బలిగొన్న ప్రాణాలు అప్పట్లో మీడియా వర్గాలలో కూడా హాట్ టాపిక్ అయ్యాయి.

దీంతో ఈ సారి కరోనాను ఎలా ఎదుర్కొంటారనే దానిపై ఏపీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ‘టార్గెట్ టాలీవుడ్’ అన్న అంశం ఏపీలో హైలైట్ లో ఉండడంతో, కరోనాను పట్టించుకునే దశలో అధికారులు, మంత్రులు లేరు. విశేషం ఏమిటంటే, మీడియా మీట్ లకు హాజరయ్యే సందర్భంలో మంత్రులు కనీసం ఉన్న ఆ ఒక్క కరోనా నిబంధన అయినా ‘మాస్క్’ను కూడా ధరించకపోవడం!