All pan India Movies Eyeing Sankranthi Seasonఒకప్పుడు షూటింగ్ మొదలైన రోజే విడుదల తేదీని ప్రకటించుకునే సంప్రదాయం ఉండేది. కొన్నిసార్లు ఒకటి రెండు నెలలు ఎక్కువో తక్కువో దాన్ని చేరుకునే వాళ్ళు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. టాలీవుడ్ ప్యాన్ ఇండియా ట్రాప్ లో పడ్డాక ఎంత ఆలస్యమైనా పర్వాలేదు సంవత్సరాలైనా సరే ఎదురు చూద్దామనే ధోరణి బాగా పెరిగిపోతోంది. అభిమానులు తమ హీరోలను ఏడాదికి కనీసం ఒక్కసారైనా కొత్త సినిమాలో చూడాలని కోరుకుంటారు. అది సహజం కూడా. కానీ స్టార్ల ఆలోచనలు మాత్రం దానికి అనుగుణంగా లేవు. ఎంతసేపూ ఫ్లాప్ అయితే దాన్ని తట్టుకోలేమన్న మనస్తత్వంతో ఆలస్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారే తప్ప దీని వల్ల కలిగిన నష్టాన్ని గుర్తించడం లేదు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 1 ది రైజ్ వచ్చి ఏడాది అవుతోంది. ఇంకా దాని ప్రమోషన్లకే రష్యా అంటూ అక్కడా ఇక్కడా తిరుగుతున్నారు తప్పించి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనే లేదు. రెండు రోజుల్లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు కానీ అది ఏకధాటిగా రెండు వారాలకు మించి ఉండదని టాక్. పుష్ప పాలిట ఆర్టిస్టుల డేట్లు పెద్ద గుదిబండగా మారింది. రష్మిక మందన్న, ధనుంజయ్, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ అందరూ యమా బిజీగా ఉన్నారు. ఒకేసారి కాల్ షీట్లు దొరకడం లేదు. వాళ్ళ తప్పేం కాదు. ఎప్పుడో చేసుకున్న కమిట్ మెంట్లను వదులుకుని పుష్ప 2 కోసం పరిగెత్తుకుని రాలేరుగా. అది భావ్యం కాదు కూడా.

ఇక ఎన్టీఆర్ 30ది మరో కథ. అదిగో పులి ఇదుగో తోక తరహాలో ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో అంతు చిక్కడం లేదు. దర్శకుడు కొరటాల శివ బయట కనిపించడం లేదు సరికదా ఏకంగా స్నేహితులు పిలిచిన ఈవెంట్లకు కూడా సారీ చెప్పేస్తున్నారు. సరే స్క్రిప్ట్ పనుల్లో బిజీ ఉన్నారనుకున్నా ఆచార్య వచ్చి ఎనిమిది నెలలు అవుతోంది. ఇదింకా కొలిక్కి రాకపోవడం ఆశ్చర్యమే. అసలు హీరోయిన్ ఎవరో భేతాళుడి భుజం మీదున్న విక్రమార్కుడు కూడా చెప్పలేడేమో. లేట్ అవ్వడానికి ఇదీ కారణమే. ఇదంతా ఒక ఎత్తు అయితే విదేశీ ట్రిప్ కోసం తారక్ ఫ్యామిలీతో కలిసి వెళ్లిపోవడం తనకు హ్యాపీనే కానీ ఫ్యాన్స్ కి మరింత నీరసం కలిగించింది. ఇంకో నెల వెయిటింగ్ తప్పదు

ఈ రెండు సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయనేది కాసేపు పక్కనపెడితే 2024 సంక్రాంతి విడుదలకు టార్గెట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎలాగూ ఏడాది సమయం ఉంది కాబట్టి పెద్ద కష్టమేమి కాదనే ఆలోచన. వీళ్లిద్దరే కాదు ఒకవేళ షూటింగ్ ఆలస్యమైతే రామ్ చరణ్ శంకర్ ల ప్యాన్ ఇండియా మూవీ కూడా అదే సీజన్ ని టార్గెట్ చేస్తుంది. ఇలా మూడు తలపడటం చాలా రిస్క్ అవుతుంది. ఇప్పుడే ఒక నిర్ధారణకు రాలేం కానీ పుష్ప 2, ఎన్టీఆర్ 30ల లక్ష్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అలా జరిగిన పక్షంలో బన్నీ తారక్ ఫ్యాన్స్ కు సుదీర్ఘమైన ఎదురు చూపులు తప్పవు. చూస్తుంటే ఇప్పటి జెనరేషన్ హీరోలు పట్టుమని యాభై సినిమాలు చేయడం కూడా కష్టమేమో.