Naga-Chaitanya-Custodyస్టార్ ఫ్యామిలీ లెగసీని మోసేవాళ్ళలో ఇద్దరు హీరోలంటే ఉపయోగాలతో పాటు పలు రకాల ఒత్తిళ్లు ఉంటాయి. ముఖ్యంగా ఫ్యాన్ ఫాలోయింగ్ బలంగా ఉన్నవాళ్లకు ఇది మరీ ఎక్కువ. నాగ చైతన్యకు అలాంటి సమస్యే వచ్చి పడింది. ఏజెంట్ డిజాస్టర్ గురించి గత నాలుగు రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో, సోషల్ మీడియాలో ఎడతెరపి లేకుండా డిస్కషన్లు జరుగుతూనే ఉన్నాయి. నిర్మాత అనిల్ సుంకర ఏకంగా బౌండ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ చేశామని ట్విట్టర్లో బహిరంగ క్షమాపణ చెప్పి పెద్ద సంచలనమే రేపారు

ఇదంతా చైతు కస్టడీ మీద భారం పెంచుతోంది. అక్కినేని అభిమానులు బాగా డిస్ట్రబ్ అయ్యారు. వాళ్లకు అర్జెంట్ గా హిట్టు కావాలి. అఖిల్ కొత్త సినిమా ఎప్పుడు మొదలుపెడతాడో ఇప్పట్లో చెప్పలేం. యువి బ్యానర్లో కొత్త దర్శకుడితో సెట్ చేసుకున్న కాంబినేషన్ అంత త్వరగా సెట్స్ పైకెళ్లేలా లేదు. రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ తో నాగార్జున చేయబోయే చిత్రం రీమేక్ హక్కుల గొడవలో పడి అంతకంతా ఆలస్యమవుతూనే ఉంది. సో మే 12 రాబోతున్న కస్టడీ కనక కరెక్ట్ గా కొడితే అసంతృప్తి సెగలు చల్లారతాయి.

కస్టడీ మీద భీభత్సమైన బజ్ లేదు కానీ ప్రమోషన్ల విషయంలో టీమ్ ఏమైనా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తోందేమో చూడాలి. ఇక్కడ టెన్షన్ పడేందుకు కొన్ని అంశాలున్నాయి. వెంకట్ ప్రభుకి ఇది మొదటి తెలుగు సినిమా. డిఫరెంట్ గా తీస్తారనే పేరుంది కానీ ఈ మధ్య టాలీవుడ్ కు వచ్చేసరికి తమిళ దర్శకులు దెబ్బ తింటున్న దాఖలాలు చూస్తున్నాం. మానాడు తీసిన విధానం దాని ఫలితం చూశాకే కస్టడీకి రూట్ క్లియరయ్యింది. సో చాలా స్పెషల్ గా ఉంటేనే ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన అందుకోవచ్చు.

హీరోయిన్ కృతి శెట్టి ఫామ్ లో లేదు. తనూ బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. తండ్రికొడుకులు ఇళయరాజా-యువన్ శంకర్ రాజాల నుంచి సంగీతంపరంగా డీసెంట్ స్కోర్ వస్తే చాలు. అక్కినేని బ్రాండ్ అయిపోయిందని, నాగార్జున కొడుకుల కెరీర్లని సరిగా ప్లాన్ చేయడం లేదని కామెంట్లు ఎక్కువవుతున్న టైంలో కస్టడీ సక్సెస్ కావడం అంతో ఇంతో ఈ ప్రచారాలకు బ్రేక్ వేస్తుంది. పైగా చైతు కూడా హిట్టు కోసమే చూస్తున్నాడు. థాంక్ యు, లాల్ సింగ్ చద్దా గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఇవి మానాలి. ఇన్ని రకాలుగా చెయ్ మీద భారం పడుతోంది. మరి హిట్టు కొట్టి అన్నింటికి సమాధానం ఇస్తాడో లేక మరో ప్రశ్నగా మిగులుతాడో పది రోజుల్లో తేలిపోతుంది.