Chandrababu Naiduరాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడుకి అధికారం కట్టబెట్టిన ప్రజలు 2019 ఎన్నికలో దారుణంగా ఓడించారు. అందుకు కొన్ని స్వీయ తప్పిదాలతోపాటు ఆయనను వ్యతిరేకిస్తున్న రాజకీయశక్తులన్నీ ఏకం కావడం కూడా ఓ కారణమని అందరికీ తెలుసు. ప్రధాని నరేంద్రమోడీతో విరోదం, తెలంగాణ సిఎం కేసీఆర్‌ కన్నెర్ర చేయడం, జగన్మోహన్ రెడ్డి ‘ఒక్క ఛాన్స్’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పాదయాత్రతో ప్రజలలో ఎరప్డిన సానుభూతి, జనసేన వేరేగా పోటీ చేసి ఓట్లు చీల్చడం వంటి అనేకానేక అంశాలు టిడిపి ఓటమికి కారణమయ్యాయి.

అయితే అందుకు టిడిపి, చంద్రబాబు నాయుడు మాత్రమే నష్టపోలేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, ప్రజలు సైతం మూల్యం చెల్లించవలసి రావడమే బాధాకరం. అమరావతి నిర్మాణ పనులు నిలిచిపోవడమే ఇందుకు ఓ నిదర్శనం. అయితే 2019 ఎన్నికల సమయంలో టిడిపి వ్యతిరేక రాజకీయ శక్తులు ఏవిదంగా ఏకం అయ్యాయో మళ్ళీ సరిగ్గా ఆవిదంగానే ఏకం అవుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

గత మూడున్నరేళ్ళుగా అలుపెరుగని పోరాటాలు చేసి మళ్ళీ కోలుకొన్న టిడిపిని, రాజకీయంగా మరోసారి చావుదెబ్బ తీసేందుకు టిడిపి వ్యతిరేక శక్తులు ఏకం అవుతున్నాయి. మొన్నటి వరకు సిఎం జగన్మోహన్ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని తిట్టిపోసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడుని తిట్టిపోస్తున్నారు. నెల్లూరు, గుంటూరు ఘటనలకి చంద్రబాబు నాయుడుని బాధ్యుడిని చేసి శిక్షించాలని వైసీపీ మంత్రుల భాషలోనే మాట్లాడుతున్నారు.

ఇక ఎవరు డబ్బిస్తే వారికోసం సినిమాలు తీసిపెట్టే బూతు సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా నోటికి పనిచెపుతున్నాడు. హిట్లర్, నెపోలియన్ తర్వాత చంద్రబాబు నాయుడే అంత దుర్మార్గుడు, దుష్టుడు అంటూ సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నాడు. వచ్చే ఎన్నికలలో టిడిపికి నష్టం కలిగించేందుకు రెండు సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే.

గత ఏపీ శాసనసభ ఎన్నికలలో తెర వెనుక చక్రం తిప్పి టిడిపిని ఓడగొట్టిన తెలంగాణ సిఎం కేసీఆర్‌, ఈసారి బిఆర్ఎస్‌ పార్టీతో ఏపీ రాజకీయాలలో నేరుగానే ప్రవేశిస్తున్నారు. తెలంగాణలో సెంటిమెంట్‌ రాజకీయాలు చేసే ఆయన, ఏపీ ప్రజల కుల బలహీనతతో రాజకీయాలు చేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. టిడిపితో చేతులు కలపాలని భావిస్తున్న పవన్‌ కళ్యాణ్‌ని దెబ్బతీసేందుకు కేసీఆర్‌ కూడా కాపు ఓటు బ్యాంక్‌మీదే దృష్టి పెట్టారు. బిఆర్ఎస్‌లో ముందుగా కాపు నేతలని చేర్చుకోవడమే ఇందుకు నిదర్శనం.

ఇక చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ రోడ్ల మీద తిరగకుండా చేసి ప్రజలతో కనెక్షన్ కట్ చేయగలిగితే, వాటిని సులువుగా ఓడించవచ్చనే ఆలోచనతో వైసీపీ మూడు రాజధానులతో ప్రభుత్వం పావులు కదుపుతుండటం, రోడ్ షోలపై ఆంక్షలు విధిస్తూ జీవో జారీ చేయడం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇంకా బిజెపి ఏం చేయబోతోందో ఎవరికీ అంతుపట్టడం లేదు. అదీ రంగంలో దిగితే టిడిపికి ఎదురీత తప్పదు.

వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చేస్తానని పవన్‌ కళ్యాణ్‌ చెపుతున్నారు. కానీ అంతకంటే ముందు ఏపీలో టిడిపి వ్యతిరేక శక్తులన్నీ మళ్ళీ ఏకం అవుతుండటం గమనార్హం. కనుక చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు ఈ వ్యతిరేక శక్తులన్నిటినీ ఏవిదంగా ఎదుర్కొంటారో… ఎదుర్కోగలరో లేదో కాలమే చెపుతుంది.