YSRCP_Ali_Pawan_Kalyanపవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌, కమెడియన్ ఆలీ మద్య ఎంత బలమైన స్నేహ సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలుసు. తన కుమార్తె పెళ్ళికి పవన్‌ కళ్యాణ్‌ రాలేకపోతే అందరూ పవన్‌ కళ్యాణ్‌ని విమర్శిస్తుంటే ఆలీ ఆయనని వెనకేసుకురావడమే వారి స్నేహానికి తాజా ఉదాహరణ. కనుక అలీ తప్పకుండా జనసేనలో చేరుతారని అందరూ భావిస్తే ఆయన వైసీపీలో చేరి అందరికీ షాక్ ఇచ్చారు.

అయితే అలీ వైసీపీలో చేరడానికి బలమైన కారణమే ఉంది. ఆయనకి ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో అడుగుపెట్టాలనే ఓ కోరిక ఉంది. దాని కోసమే ఆయన రాజకీయాలలోకి వచ్చి పార్టీలు మారుతూ వైసీపీలోకి వచ్చి పడ్డారు. వైసీపీలో తనకి టికెట్‌ లభిస్తే సిఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోతో తాను తప్పకుండా ఎమ్మెల్యే కాగలనని అలీ గట్టిగా నమ్ముతున్నారు. అదే… జనసేనలో చేరితే టికెట్‌ లభిస్తుందనే గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఆ పార్టీ ప్రస్తుతం బిజెపితో పొత్తులో ఉంది. రాబోయే రోజుల్లో టిడిపితో పొత్తులు పెట్టుకోవాలనుకొంటోంది. పొత్తులలో సీట్ల లెక్కలు చాలానే ఉంటాయి కనుక అలీ కోరుకొన్నట్లు సీటు లభించే అవకాశం ఉండకపోవచ్చు. కానీ వైసీపీలో అయితే జగన్‌ కటాక్షిస్తే చాలు టికెట్‌ లభిస్తుంది. అందుకే అలీ వైసీపీని ఎంచుకొన్నట్లు చెప్పుకోవచ్చు.

అలీ వైసీపీలో ఉన్నారు కనుక ఆ పార్టీ భాషలోనే మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో వైసీపీ 175 సీట్లు గెలుచుకోవడం ఖాయం. జగనన్న ఆదేశిస్తే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మీద పోటీ చేయడానికి సిద్దం,” అని ఈరోజు ప్రకటించారు.

ఆవిదంగా అలీ తాను శాసనసభకి పోటీ చేయాలనుకొంటున్నానని కనుక టికెట్‌ ఇవ్వాల్సిందిగా సిఎం జగన్‌కి విజ్ఞప్తి చేసిన్నట్లు భావించవచ్చు. అయితే వచ్చే ఎన్నికలలో పవన్‌ కళ్యాణ్‌ని తప్పనిసరిగా ఓడించడం వైసీపీకి చాలా అవసరం కనుక ఆయనపై బలమైన కాపు నేతనే పోటీకి నిలపవచ్చు.