ali-comedian-digital-mediaకమెడియన్ అలీకు ఈ మధ్య సినిమాలు తగ్గిపోయాయి. ఇటీవలే జరిగిన ఎన్నికలలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ తరపున ప్రచారం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయనకు ఏదైనా పెద్ద నామినేటెడ్ పదవి వస్తుందని అంతా అనుకుంటున్నారు.

మరోవైపు అలీ డిజిటల్ మీడియా వైపు చూస్తున్నారు. దీనికోసం అలీ ఒక నిర్మాణ సంస్థను పెడుతున్నారు… దాని పేరే అలీవుడ్. అలీవుడ్ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో ఆయన ఈ సంస్థను ఏర్పాటుచేశారు. నూతన సంవత్సరంలోనే దాన్ని ఆయన ప్రారంభించారు.

హిందీ, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నిర్మాణాలు ప్రారంభించాలన్నది ఈ సంస్థ సంకల్పం. ఈ సంస్థపై వెబ్ సిరీస్, టీవీ షోలు, డైలీ సీరియల్స్, వాణిజ్య చిత్రాలు రూపొందించే ఆలోచనలో ఉన్నారు అలీ. నష్టాలు లేకుండా నిర్మాతలకు అదాయం లభించే అవకాశం మా అలీవుడ్ సంస్థ కల్పిస్తుందన్నారు అలీ.

24 క్రాఫ్ట్‌లకు సంబంధించిన సేవలను తమ సంస్థలో కల్పిస్తున్నామని, తాను తీయబోయే వెబ్ సిరీస్, టీవీ షోలను అభిమానులు ఆదరించాలని ఈ సందర్భంగా కోరారు. అలీ ఈ ఏరియాలో కేవలం నిర్మాణం వరకే పరిమితం అవుతారా లేక నటించడం కూడా చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది.