Akun Sabharwal Tollywood drugsతెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తోన్న డ్రగ్స్ కేసులో ఇప్పటికే 12 మంది ప్రముఖులకు నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. ఈ నోటీసులు అందుకున్న తర్వాత తనీష్, నవదీప్, నందు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా వంటి వారు మీడియా ముందుకు వచ్చి తమకు సంబంధం లేదంటూ తమ గోడు వెలిబుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక రవితేజ, పూరీ జగన్నాధ్, ఛార్మి, ముమైత్ ఖాన్ వంటి వారు స్పందించలేదు గానీ, విచారణను ఎదుర్కొవడం మాత్రం ఖాయం.

ఇదిలా ఉంటే తాజాగా మరో సమాచారం టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. మొదటి జాబితాలో లిస్ట్ ఇలా ఉంటే, ఈ కేసులో రెండవ జాబితా కూడా సిద్ధమైందని, మరికొంతమంది సినీ సెలబ్రిటీలకు ‘సిట్’ నోటీసులు అందజేయనుందని తెలుస్తోంది. దీంతో ఇంకెంత మంది సినీ ప్రముఖులు ఈ కేసులో ఉన్నారో అన్న చర్చలకు తెరలేపినట్లయ్యింది. ఫస్ట్ లిస్ట్ లో పేర్లు తొలుత అధికారికంగా వెల్లడించకుండా, అధికారులు దోబూచులాడిన విషయం తెలిసిందే.

తొలుత పరోక్షంగా వారి ప్రొఫైల్స్ ను తెలిపిన అధికారులు, మీడియా వర్గాలకు పేర్ల జాబితాను కావాలనే లీక్ చేసారన్న ఆరోపణలను ఎదుర్కొన్నారు. దీంతో రెండవ జాబితాలో కూడా పేర్లను కూడా అలాగే చేస్తారా? లేక అధికారికంగా వెల్లడిస్తారా? ఏది ఏమైనా మరో జాబితా ఉందన్న విషయం డ్రగ్స్ ను వినియోగించిన సినీ సెలబ్రిటీల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోందని చెప్పవచ్చు. మరో వైపు సెలవులను రద్దు చేసుకున్న అకున్ సబర్వాల్ కు పూర్తి అధికారాలిస్తూ అందరి పేర్లు బయటపెట్టండి అంటూ సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు.