Akhilesh Yadav, Akhilesh Yadav Smart Phone, Akhilesh Yadav Smart Phone Scheme, Akhilesh Yadav Smart Mobile Phone Scheme, CM Akhilesh Yadav Smart Mobile Phone Schemeఉత్తరప్రదేశ్‌లో ‘ఉచిత’ జల్లు ప్రారంభమైంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే తమ అస్త్రాలకు పదును పెడుతూ ఓటర్లకు తాయిలాలను ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్‌ వాదీ పార్టీ మరోమారు అధికార పీఠాన్ని అధిరోహించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఓటర్లపై ‘స్మార్ట్ ఫోన్’ అస్త్రం ప్రయోగించారు.

వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజలకు స్మార్ట్ ఫోన్లను ఉచితంగా ఇస్తానని వరాల జల్లు కురిపించారు. ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంటే తాను మళ్లీ పగ్గాలు చేపట్టాక వాటిని ఇస్తానంటూ మెలిక పెట్టారు. తనను గెలిపిస్తేనే ఈ వరం అందుతుందని పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా ‘సమాజ్‌వాది స్మార్ట్ ఫోన్ యోజన’ అనే కొత్త పథకాన్ని సోమవారం ప్రవేశపెట్టారు. 2017 అర్ధభాగం తర్వాత ప్రతీ ఇంటికి అత్యాధునిక స్మార్ట్‌ ఫోన్లను డెలివరీ చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఈ ఫోన్లలో చాలా ఫీచర్లు ఉంటాయని, పేదల నుంచి విద్యావంతుల వరకు ఇవి ఎంతగానో ఉపయోగపడాయని పేర్కొన్నారు. ఇందులో ఉండే యాప్స్, ఫేస్‌బుక్ ద్వారా ప్రభుత్వ పథకాల గురించి నేరుగా తెలుసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. యూపీలో ఉంటూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఈ పథకానికి అర్హులని పేర్కొంది. అయితే కుటుంబ ఆదాయం లక్ష రూపాయలు దాటితే ఈ పథకం వర్తించదని స్పష్టం చేసింది. వచ్చే వారం నుంచే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు.

2012 ఎన్నికల సందర్భంగా విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చి సమాజ్‌ వాదీ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరిప్పుడు స్మార్ట్‌ ఫోన్లు ఆ పార్టీని మరోమారు గద్దెనెక్కిస్తాయో లేదో వేచి చూడాల్సిందే. భారతదేశంలో ‘ఉచితం’ ప్రభావం ఏ రేంజ్ లో ఉందో చాటిచెప్పడానికి మరొక ఉదాహరణ ఈ ఉదంతం. ప్రజలను ఆకర్షించే ‘ఉచిత’ పధకాలతో అధికార పీఠాన్ని అధిరోహించాలన్నదే మన రాజకీయ నాయకుల “లక్ష్యం.”