ప్రారంభమైన సినిమాలే చివరి వరకు కొనసాగుతాయో లేదో అన్న సందేహాలు టాలీవుడ్ లో వ్యక్తమవుతున్న నేపధ్యంలో… అసలు ప్రారంభం కాని సినిమాల గురించి పట్టించుకునేదెవరు..? గతంలో రామ్ చరణ్, ఇటీవల పవన్ కళ్యాణ్ తమిళ దర్శకులతో సినిమాలను ప్రారంభించి, తర్వాత వదిలేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అక్కినేని ఇంట కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకోబోతోందన్న వార్త ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.
అఖిల్ అక్కినేని హీరోగా ప్రారంభం కావాల్సిన ఉన్న రెండవ సినిమాకు అడ్డంకులు తప్పేలా కనపడడం లేదు. ‘అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాధ’ సినిమాల దర్శకుడు హను రాఘవపూడితో తన రెండవ సినిమా ఉండబోతోందని అఖిల్ స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, తాజా సినీ వర్గాల సమాచారం మేరకు, అఖిల్ రెండవ సినిమా దర్శకుడు మారాడని, హను రాఘవపూడి స్థానంలో ‘మనం’ దర్శకుడు విక్రమ్ కే కుమార్ వచ్చి చేరాడని తెలుస్తోంది.
ఇటీవల విక్రమ్ చెప్పిన ఓ కధ ‘కింగ్’ నాగార్జునను మెప్పించడంతో ముందుగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని టాలీవుడ్ వర్గాల టాక్. అయితే తాను ఒక ప్రేమకధలో నటించబోతున్నట్లుగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిల్ స్పష్టం చేసాడు. ప్రయోగాత్మక సినిమాలకు పెట్టింది పేరుగా మారిన విక్రమ్, మరి ప్రయోగాత్మక ప్రేమకధను తెరకెక్కిస్తారా? లేక తన శైలికి భిన్నంగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ఫక్తు ప్రేమకధకు వెండితెర రూపం ఇస్తారా అనేది అక్కినేని అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. అతి త్వరలోనే తన నుండి ఒక ప్రకటన వస్తుంది… అప్పటివరకు వేచిచూడండి… అంటూ ఓ విజ్ఞప్తి చేసాడు అక్కినేని ప్రిన్స్.