Akhil Akkineni Agentపరిశ్రమలో సక్సెస్ రేట్ ఎప్పుడూ పది శాతంలోపే ఉంటుంది. అంటే పది సినిమాలు వస్తే అందులో మహా అయితే మూడు నాలుగు మాత్రమే విజయం సాధించి నిర్మాతలకు లాభాలిస్తాయి. ఇప్పుడంటే ఓటిటి, డబ్బింగ్ అంటూ అదనపు ఆదాయానికి ఆప్షన్లు పెరిగి నిర్మాతలకు భారం తగ్గింది కానీ ఒకప్పుడు కేవలం శాటిలైట్ ప్లస్ వీడియో హక్కులతో నెట్టుకురాలేక ప్రొడ్యూసర్లు నరకం చూసేవాళ్ళు. సరే ఏ భాషలో చూసినా ఇది సహజం. ప్రత్యేకంగా తెలుగులోనే ఫ్లాపులు ఎక్కువని చెప్పడానికి లేదు. దేశమంతా ఉన్నాయి.

ఇప్పుడు టాలీవుడ్ లో కొత్తగా క్షమాపణల సంప్రదాయం మొదలయ్యింది. ఏజెంట్ ఫలితం పట్ల అఖిల్ ట్విట్టర్ లో ఫస్ట్ రియాక్షన్ ఇచ్చాడు. అది కూడా శుక్రవారం ఓటిటి రిలీజవుతున్న టైంలో. ఎంత కష్టపడినా మంచి మూవీ ఇవ్వలేకపోయామని నిర్మాత అనిల్ సుంకర తో పాటు టీమ్ మొత్తానికి థాంక్స్ చెబుతూ ఫ్యాన్స్ కి నిరాశ కలిగించనని హామీ ఇస్తూ సుదీర్ఘమైన మెసేజ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. గతంలో అచ్చం ఇదే తరహాలో రామ్ చరణ్ వినయ విధేయ రామకు సారీ నోట్ ఒకటి విడుదల చేయడం గుర్తుండే ఉంటుంది

అన్నయ్యని చూసి తమ్ముడు వరుణ్ తేజ్ గని సమయంలో ఇదే ట్రెండ్ ఫాలో అయ్యాడు. వీళ్ళెవరూ దర్శకులకి క్రెడిట్ ఇవ్వలేదు. బ్యాడ్ అవుట్ కు ప్రాథమిక కారణం వాళ్ళే అయినా పూర్తిగా తోసేయడం కూడా కరెక్ట్ కాదనే వాళ్ళు లేకపోలేదు. అయితే ఇలాంటి లేదా ఇంతకు మించిన డిజాస్టర్లు జమానా కాలం నుంచే ఉన్నాయి. బాబా టైంలో రజినీకాంత్, జానీ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్, ఆజ్ఞాతవాసి సమయంలో త్రివిక్రమ్ ఇలా ఎవరికి వాళ్ళు నష్టాన్ని తగ్గించే దిశగా కొంత సొమ్ములను వెనక్కు ఇచ్చిన ఉదంతాలున్నాయి

అలాంటప్పుడు పబ్లిక్ గా మా సినిమా పోయిందని స్టేట్ మెంట్ ఇవ్వడం సబబేనా అంటే ఫలితం మీద గౌరవం ప్రకటించే కోణంలో కరెక్టే. కానీ ఇలా చేయడం వల్ల ఆ సినిమాకు పనిచేసిన డైరెక్టర్ లేదా ఇతర టెక్నీషియన్ల అవకాశాల మీద ప్రభావం చూపించే ప్రమాదం లేకపోలేదు. వేలు ఒకరివైపే చూపిస్తునప్పుడు మిగిలిన నాలుగు వేళ్ళు ఎవరివైపు ఉన్నాయో పట్టించుకోని ప్రపంచంలో ఉన్నాం మనం. మనసుకు కష్టమనిపించినా సారీ చెప్పడం సులభమే. కానీ ఇదే అందరూ ఫాలో అయితే భవిష్యత్తులో ప్రతి ఫ్లాపుకి ఇలాంటి క్షమాపణలే పబ్లిక్ ఆశించడం మొదలుపెడతారు. అప్పుడు చెప్పనివాళ్ళు టార్గెట్ కావొచ్చు.