Akhil's Agent Trailerబాహుబలి నుంచి అంతర్జాతీయ స్థాయికి టాలీవుడ్ విస్తరించాక హీరో మార్కెట్ తో సంబంధం లేకుండా బడ్జెట్ లు పెరిగిపోయిన మాట వాస్తవం. కంటెంట్ బలంగా ఉంటే అన్ని భాషల్లో ఆడియెన్స్ ఆదరిస్తారని ప్రత్యేకించి రెండు మూడేళ్లుగా ఋజువవుతూనే ఉంది. అఖిల్ వచ్చి ఆరేళ్లవుతున్నా ఇంకా సరైన బ్లాక్ బస్టర్ పడలేదనే ఆకలి అక్కినేని అభిమానుల్లో బలంగా ఉంది. ఎందుకంటే నాగార్జున రెండో వారసుడిగా తన మీద మాములు అంచనాలు లేవు. కానీ అవి పూర్తి స్థాయిలో నెరవేరకపోవడంతో ఆ ఒత్తిడి మొత్తం ఏజెంట్ మీద పడింది.

గూఢచారి బ్యాక్ డ్రాప్ లో సినిమాలు మనకు కొత్త కాదు. కృష్ణ, చిరంజీవి, సుమన్ లతో మొదలుపెట్టి అడవి శేష్, నిఖిల్ దాకా అందరూ చేస్తున్నారు. కానీ ఏజెంట్ వీటికన్నా కొంచెం ఎక్కువ ఎడ్జ్ తీసుకున్నట్టు కనిపించడానికి కారణం భారీతనం. దర్శకుడు సురేందర్ రెడ్డి దేశవిదేశాల్లో షూటింగ్ చేశారు. నిర్మాత అనిల్ సుంకర మంచి నీళ్లలా కోట్లు కుమ్మరించారు. మూడేళ్లు ప్రొడక్షన్ కే వెళ్లిపోయింది. అదిగో ఇదిగో అంటూ విడుదల చాలాసార్లు వాయిదా పడి ఫైనల్ గా ఏప్రిల్ చివరివారానికి లాక్ చేసుకుంది అది కూడా పీఎస్ 2కి పోటీగా.

Also Read – ఐపీఎల్ ఓటమి? జగన్ కు లింకేంటి?

సహజంగా ఇలాంటి గ్రాండియర్లు బాలీవుడ్ లో తరచూ వస్తుంటాయి. పఠాన్, ఏక్ థా టైగర్, ఫ్యాన్టమ్, ఏజెంట్ వినోద్, టైగర్ జిందా హై, మిషన్ మజ్ను, రాజీ ఇవన్నీ ఈ జానర్ లోనే వచ్చాయి. హాలీవుడ్ లో మిషన్ ఇంపాజిబుల్ తో మొదలుపెడితే వందల్లో లిస్టు రాసుకోవచ్చు. వీటిలో ఎక్కువ టెక్నికల్ స్టాండర్డ్స్ తో ప్రేక్షకులను మెప్పించినవి. అబ్బురపరిచే విన్యాసాలతో ట్విస్టులతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపించినవి. ఇలాంటి అడ్వెంచర్లు మనకు ఎప్పుడోగాని రావు. కానీ యువతరం హీరోలు వీటి మీద మనసు పారేసుకుని రిస్కులు తీసుకోవడం మంచిదే.

హీరో ఎవరైనా సరే తెగించినప్పుడే ఫలితాలు గొప్పగా ఉంటాయి. ఏజెంట్ ట్రైలర్ చూసి ఇదేదో అద్భుతమని సర్టిఫికెట్ ఇచ్చేస్తే తొందరపాటు అవుతుంది కానీ విజువల్స్ చూశాక ఏదో బలమైన కంటెంట్ తో వస్తున్నారనే సంకేతమైతే జనంలోకి వెళ్లిపోయింది. భవిష్యత్తులో రాబోయే గూఢచారి 2, స్పై లాంటివి మెప్పిస్తే కనక ఈ జానర్ లో మరికొన్ని ప్రయోగాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఎంతసేపూ కమర్షియల్ మాస్ ఫార్ములా పేరుతో పదే పదే ఒక మూసలో వెళ్తున్నవాళ్ళ కన్నా ఇలాంటి యాక్షన్ ఎంటర్ టైనర్ల వైపు టర్న్ తీసుకోవడం స్వాగతించాల్సిన విషయమే.

Also Read – అప్పుడు బెదిరించి, ఇప్పుడు బకాయిలు చెల్లించేశారట!

Also Read – టిడిపి మౌనం కూడా వైసీపికి ఆందోళన కలిగిస్తోందా?