'అఖండ' నిర్మాత ముందే 'హింట్' ఇచ్చారు!నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ‘హ్యాట్రిక్’ మూవీ ప్రస్తుతం ప్రేక్షకులతో కళకళలాడుతోంది. ఈ బొమ్మపై ఎవరు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేసినా, అందరిలో మాత్రం ఒక పాయింట్ కామన్ గా ఉంటోంది. అదే ‘అఖండ’ సినిమా రన్ టైం, అది కూడా ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కు సంబంధించి!

2 గంటల 47 నిముషాల పాటు ఉన్న ఈ సినిమాలో ఇంటర్వెల్ వచ్చే సమయానికి ఒక గంటా 30 నిముషాలు ఉండడం ప్రేక్షకుల సహనానికి కారణమైంది. ముఖ్యంగా కలెక్టర్ రోల్ లో ఎంట్రీ వచ్చిన హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ – బాలయ్యల ట్రాక్ తెరమీద సరిగా పండకపోవడం ఈ అసహనానికి ప్రధాన కారణమైంది.

అందులోనూ కలెక్టర్ రోల్ మీద కూడా ‘నాకండి బాబు బాగా నాకండి, అమ్మ గారు బాగా నాకిస్తున్నారు, ఇంకా బాగా నాకండి’ వంటి డబుల్ మీనింగ్ డైలాగ్ లు వేయడం అనేది తెరమీద జుగుప్సాకరంగా మారింది. బహుశా ఈ ట్రాక్ లో ఉన్న ఒక సాంగ్ మరియు ఫస్ట్ హాఫ్ లోని కొన్ని సన్నివేశాలు ఎడిటింగ్ చేసినా సినిమాకు జరిగే డామేజ్ ఉండదనేది సినీ విశ్లేషకులు ఇప్పటికే వ్యక్తపరిచిన విషయం.

నిజానికి ఈ చిత్ర నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి గారు ‘అఖండ’ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చెప్పిన ఇంటర్వ్యూలో… సినిమా నిడివి ఉన్న 2 గంటల 47 నిముషాలలో 47 నిముషాలు తీసేస్తే మిగతా 2 గంటలు సినిమా అదిరిపోతుంది అన్నారు. ఈ మాటలలోని ‘ఆంతర్యం’ సినిమా రిలీజ్ కు ముందు ప్రేక్షకులకు సరిగా అర్ధం కాలేదు గానీ, రిలీజ్ తర్వాత క్లారిటీ వచ్చినట్లయ్యింది.