Akhanda in Mass theatresఏదైనా ఒక మంచి జరిగినపుడు దానిని ఆహ్వానించాలి గానీ, బురద జల్లే ప్రయత్నం చేయకూడదు. ప్రస్తుతం “అఖండ” సినిమాపై ఓ వర్గం అదే పని నిరంతరంగా చేస్తుండడం విస్తుపోయే అంశం. కరోనా నుండి మరియు ఏపీలో సినీ ఇండస్ట్రీపై తీసుకున్న ప్రతికూల నిర్ణయాలను ఎదుర్కొంటూ ‘అఖండ’ అమోఘమైన విజయం దిశగా దూసుకుపోతోంది.

సినీ ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోసిన “అఖండ” సినిమాను కమ్మ సామాజిక వర్గానికే అంటకడుతూ కొందరు చేస్తున్న వాదనలు అర్ధం పర్ధం లేనివిగా వస్తోన్న లెక్కలే చెప్తున్నాయి. యుఎస్ లో వస్తోన్న కలెక్షన్స్ వెనుక కమ్మ సామజిక వర్గం ఉందని, 50 శాతం షేర్ ఒక్క డల్లాస్ నుండే వస్తోందని, ఇక్కడే కమ్మ వాళ్ళు టికెట్లు కొని పంచుతున్నట్లుగా రాసుకొస్తున్నారు.

అయితే తెలుగు రాష్ట్రాలలో మాదిరి కాకుండా, యుఎస్ మార్కెట్ అధికారిక లెక్కలు అందుబాటులో ఉంటాయి. మరి ఆ గణాంకాలు చూస్తే 25 శాతం కూడా దాటలేదు. ఇదంతా పనికట్టుకుని ‘అఖండ’పై సాగుతున్న దుష్ప్రచారంగా పేర్కొనవచ్చు. ఒకవేళ ఆ వర్గం చేస్తోన్న ఆరోపణలే నిజమని భావిస్తే, యుఎస్ లో కంటే రెండు తెలుగు రాష్ట్రాలలోనే కమ్మ జనులు ఎక్కువగా ఉంటారు.

మరి ఏపీ, తెలంగాణాలలో కూడా ఆ సామాజిక ప్రజలే సినిమాను చూస్తున్నారా? లేక వాళ్ళే అన్ని షోల టికెట్లు కొని మిగిలిన సామాజిక వర్గాలకు పంచి పెడుతున్నారా? ఆలోచిస్తేనే హాస్యాస్పదంగా ఉండడం సహజం. ఒకవేళ ఇందులో 1% నిజమని ఉందని భావిస్తే… సీడెడ్ ఏరియాలో “అఖండ” సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు.

మరి సీడెడ్ లో కీలకంగా భావించే కడప, కర్నూల్ లో కమ్మ సామాజిక వర్గం చాలా తక్కువ సంఖ్యలో ఉంటుంది. మరి ఈ ఏరియాలలో కూడా వారి ఆధిపత్యమే కొనసాగుతుందా? కడప, రాజంపేటలలో ‘అఖండ’కు ప్రేక్షకులు ఎలా తరలి వస్తున్నారో ఇప్పటికే పలు వీడియోలు సోషల్ మీడియాలలో హల్చల్ చేసాయి. వీళ్లంతా కూడా కమ్మ వారేనా?

బహుశా సినీ పరిశ్రమకు మంచి జరగడం ఇష్టం లేదో ఏమో గానీ, ‘అఖండ’పై తమ ఏడుపును బహిరంగంగానే ప్రదర్శిస్తున్నారు. మారిన కాలం… మల్టీస్టారర్ ల రాకతో… అభిమానుల నడుమ ఒకప్పుడు ఉన్న విద్వేషాలు ఒక్కొక్కటిగా దూరమవుతూ వస్తున్నాయి. కానీ ‘అఖండ’ సక్సెస్ క్రెడిట్ ‘కమ్మ’ వారిదే అంటూ అభిమానుల నడుమ కులం పేరుతో చిచ్చుపెట్టడం ఎంతవరకు సమంజసం?

తమ పబ్బం గడుపుకోవడానికి లేనివి ఉన్నట్లుగా వంద సార్లు చెప్తే నిజం అయిపోతాయా? బహుశా రాజకీయ రంగంలో ఇలాంటి స్ట్రాటజీని అనుసరించే సక్సెస్ సాధించారు గనుక, అదే పోకడను సినీ పరిశ్రమకు కూడా వర్తింపచేయాలని భావిస్తున్నారేమో? కానీ గత కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలు నిశితంగా పరిశీలిస్తున్న ప్రజలలో ఇప్పటికే చైతన్యం వస్తోందన్న అంశాన్ని గమనించడం లేదనుకుంటా!?