Aishwarya Rai CONDEMNS Panama papers leakసంచలనం సృష్టిస్తున్న ‘బ్లాక్ మనీ’ దాచుకున్న వారి వివరాల్లో 500 మంది భారతీయుల పేర్లుండటం ఇండియాను ఓ కుదుపు కుదుపుతోంది. గత 40 సంవత్సరాలకు చెందిన దాదాపు 1.15 కోట్ల పత్రాలను పరిశీలించి జర్మనీ పత్రిక ‘సుడియుషె జీతంగ్’లో వెల్లడైన ‘పనామా పేపర్స్’ వివరాల ప్రకారం, బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ లతో పాటు డీఎల్ఎఫ్ యజమాని కేపీ సింగ్, ఆయన 9 మంది కుటుంబ సభ్యులు, గౌతమ్ అదానీ, ఆయన సోదరుడు వినోద్ అదానీ, అపోలో టైర్స్, ఇండియా బుల్స్ ప్రమోటర్ల పేర్లు కూడా ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్ కు చెందిన రాజకీయ నాయకుడు శిశిర్ బజోరియా, లోక్ సత్తా ఢిల్లీ విభాగం మాజీ చీఫ్ అనురాగ్ కేజ్రీవాల్, ముంబై గ్యాంగ్ స్టర్ ఇక్బాల్ మిర్చి (ప్రస్తుతం మరణించాడు)లు ఉన్నారు. ఐశ్వర్యా రాయ్, ఆమె తల్లిదండ్రులు, సోదరులు బ్రిటన్ లో 2005లో రిజిస్టరైన అమిక్ పార్ట్ నర్స్ లిమిటెడ్ లో డైరెక్టర్లని, ఆ సంస్థ ద్వారా బ్లాక్ మనీని నిర్వహించారని పేర్కొంది. అమితాబ్ నాలుగు విదేశీ సంస్థల్లో డైరెక్టర్ గా ఉన్నారని, ఈ కంపెనీలు 5 వేల డాలర్ల నుంచి 50 వేల డాలర్ల మూలధనం నిల్వలను కలిగినప్పటికీ, మిలియన్ల విలువైన డీల్స్ చేశాయని పేర్కొంది. ఇండియాలో జరిగే ఎన్నో క్రికెట్ డీల్స్ లో అవకతవకలు జరుగుతున్నాయని, ఆర్బీఐ నిబంధనలు ఇందుకు సహకరిస్తున్నాయని ‘పనామా పేపర్స్’ అభిప్రాయపడింది.

కాగా, 76 దేశాలకు చెందిన 375 మంది జర్నలిస్టుల బృందం ‘పనామా పేపర్స్’ ప్రాజెక్టులో భాగస్వామ్యమై ప్రపంచ వ్యాప్తంగా నల్లధనం దాచుకున్న వారి వివరాలను వెల్లడించే దిశగా పరిశోధనలు సాగించగా, ఇప్పుడా వివరాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ టీమ్ లో ఇండియాలోని ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ దినపత్రిక భాగమైంది. పత్రికకు చెందిన 25 మంది ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ‘పనామా పేపర్స్’కు సహకారం అందించారు.

అయితే ఈ జాబితాలో తన పేరు రావడంపై బాలీవుడ్ బ్యూటీ, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్ బచ్చన్ మండి పడింది. బ్లాక్ మనీ కుంభకోణంలో తన పేరుండటం షాక్ ను కలిగించిందని, ఇదంతా పచ్చి అబద్ధమని, పూర్తి అవాస్తవమని పేర్కొంది. ఈ మేరకు ఐశ్వర్య మీడియా సలహాదారు నుంచి ఓ ప్రకటన వెలువడింది.