gopal-vittal-airtel-offerఇతర టెలికాం కంపెనీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న ‘జియో’ దెబ్బకు మిగతా సంస్థలన్నీ తన టారిఫ్ లను మార్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు మారిన టారిఫ్ లన్నీ ఇండియాకు మాత్రమే పరిమితం కావడంతో, తొలిసారిగా ఎయిర్ టెల్ ఇంటర్నేషనల్ మార్కెట్ పై ఫోకస్ చేసింది. ఇందు నిమిత్తం కొత్త ప్రణాళికలతో జియోకు చెక్ చెప్పాలని భావిస్తోంది. జియో పోటీని తట్టుకునేందుకు వినియోగదారులకు భారతీ ఎయిర్ టెల్ దిమ్మతిరిగే ఆఫర్‌ను ప్రకటించనుందని సమాచారం.

ఇందులో భాగంగా ఓ ‘అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌’ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ఆఫర్ కింద అంతర్జాతీయంగా అన్ని ఇన్‌కమింగ్స్ కాల్స్ ఇక ఉచితంగా చేసుకోవచ్చు. అలాగే ఎయిర్‌ టెల్ నెంబరును ఏ దేశంలోనైనా వాడుకునే అవకాశాన్ని కల్పించేందుకు సమాయత్తమవుతోంది. ఎక్కువ కాల్ చార్జీ, డేటా రీచార్జీలపై ఆందోళన అవసరం లేదని ఈ ప్యాక్ పోస్టు పెయిడ్, ప్రీ పెయిడ్ వినియోగారులందరికీ వస్తుందని ఎయిర్‌టెల్ పేర్కొంది.

‘అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్స్’ ఆఫర్ కింద ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్, ఇండియాకు ఉచితంగా మెసేజ్‌లు చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాదు అన్ని ప్రముఖ దేశాల నుంచి ఇండియాకు ఉచితంగా కాల్స్ చేసుకోవడంతో పాటు డేటా ప్రయోజనాలు కూడా అందిస్తామని పేర్కొంది. ఈ ప్యాక్ కాలపరిమితి 30 రోజులు అని పేర్కొంది. అలాగే ఒక్క రోజు మాత్రమే విదేశాల్లో గడిపేవారు వన్‌ డే ప్లాన్ కింద 10 డాలర్లు(649) చెల్లించాలని, నెలకు అయితే 30 రోజుల ప్యాక్ కింద 75 డాలర్లు (4,999) చెల్లించాల్సి ఉంటుందని వివరించింది.

అలాగే 3జీ డేటా, అపరమిత ఇన్‌ కమింగ్ కాల్స్, ఇండియాకు కాల్స్ చేసుకునేందుకు 400 ఫ్రీ మినిట్స్, ఇండియాకు అపరమితంగా మెసేజ్‌లు చేసుకునే వెసులుబాటు ఈ ఆఫర్‌ లో ప్రకటించనుంది. పది రోజుల కాలవ్యవధితో అందుబాటులో ఉండే 45 డాలర్ల ప్యాక్‌ను కూడా అందుబాటులోకి తేనుంది. అక్టోబరు మధ్య నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఎయిర్ టెల్ సిద్ధమైనట్టు సమాచారం.