Varalaxmi Sarathkumar as komalavalli
మురుగదాస్ దర్శకత్వంలో విడుదలైన “సర్కార్” మూవీ ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చుట్టూ వివాదాలు అలుముకుంటున్నాయి. ముఖ్యంగా జయలలిత పాత్ర పేరుతో అల్లుకున్న కోమలవల్లి పాత్ర వివాదాస్పదంగా మారింది. ఈ చిత్రంలో ఓ పాత్రకు జయలలిత అసలు పేరైన కోమలవల్లి పేరును పెట్టడం, ఆ పాత్ర అధికారం కోసం తండ్రిని స్వయంగా హత్య చేసినట్టు చూపించడంపై అన్నాడీఎంకే వర్గాలు మండిపడుతున్నాయి.

కోమలవల్లి పాత్రను పోషించిన వరలక్ష్మీ శరత్ కుమార్, విదేశాల్లో ఉన్న వేళ మోడ్రన్ డ్రస్సులను ధరించి, ఇండియాలో దిగగానే, నిండుగా, సంప్రదాయ చీరల్లో కనిపించడం, జయలలిత తన తొలినాళ్లలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన వేళ కనిపించిన హావభావాలనే చూపించడం అన్నాడీఎంకే వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. సీఎంగా ఉన్న తన తండ్రి, అవినీతి ఆరోపణల్లో కూరుకుపోతే, ఆయన చనిపోతేనే పార్టీ నిలుస్తుందన్న ఉద్దేశంతో, కోమలవల్లి స్వయంగా మాత్రలిచ్చి హత్య చేసినట్టు చూపించారు.

ఇక కోమలవల్లి తండ్రి పాత్రను ఎంజీ రామచంద్రన్ తో పోలుస్తున్న తమిళ తంబీలు, ఈ సినిమాపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి పొలిటికల్ మూవీ అంటే ఇలాంటి వివాదాలు సర్వసాధారణం. ఎలాంటి వివాదాలు లేకుండా “భరత్ అనే నేను”లా తీయడం చాలా కష్టసాధ్యమైన పని. రాజకీయ సబ్జెక్ట్ అంటేనే కాంట్రవర్సీతో కూడుకుని ఉంటుంది. ఉన్నంతలో ఎక్కువ వివాదాల జోలికి పోకుండా ‘సర్కార్’ను బాగానే తీర్చిదిద్దినప్పటికీ, ప్రస్తుతం జయలలిత ఎపిసోడ్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోందిఅర్ధం ఏమిటో?!