AIADMK False Hunger Strike video goes viralకావేరి మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, పార్లమెంటు సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్న అన్నాడీఎంకే అసలు స్వరూపం బట్టబయలైంది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం చర్చకు రాకుండా, తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నట్టు ఆ పార్టీ ఎంపీలు చేస్తున్నదంతా డ్రామానే అనే విషయం వెలుగు చూసింది. తమిళ రాష్ట్ర ప్రయోజనాల కోసం కావేరీ బోర్డును ఏర్పాటు చేయాల్సిందే అనే డిమాండ్ తో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకే నిరాహార దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు సైతం ఈ దీక్షలో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు చేపట్టిన నిరాహారదీక్షకు సంబంధించి కొన్ని ఫొటోలు బయటకు రావడం ఇప్పడు సంచలనంగా మారింది. నిరాహార దీక్ష మధ్యలో పక్కకు వచ్చి, కడుపునిండా భోజనాలు లాగిస్తున్న నేతల ఫొటోలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు పలువురు వ్యక్తులు మందు తాగడం కూడా వెలుగు చూసింది. దీంతో, అన్నాడీఎంకే చేస్తున్న పోరాటంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఢిల్లీలో అన్నాడీఎంకే నేతలు చేస్తున్నదంతా పొలిటికల్ డ్రామానే అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.