Aha Unstoppable Season 2 Balayya Prabhas Episode సోషల్ మీడియాలో ప్రోమోలు చేసిన హడావిడి చూసే ఆహాకు ప్రభాస్ బాలయ్యల అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కి భీభత్సమైన రెస్పాన్స్ వస్తుందనే అంచనా ఉందేమో కానీ క్రాష్ అయ్యే రేంజ్ లో అరాచకం మాత్రం ఎవరూ ఊహించనిది. ఎందుకంటే గతంలో మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఇలా ఎవరు వచ్చినా వ్యూస్ భారీగా దక్కాయి కానీ ఇలా గంటల తరబడి యాప్ ఆగిపోవడం మాత్రం ఇదే మొదటిసారి. దీన్ని బట్టే అన్ స్టాపబుల్ షో తాలూకు ప్రభావం, డార్లింగ్ ప్రభాస్ మేనియా ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. ఆహా చాలా తెలివిగా దీన్ని రెండు భాగాలుగా విభజించి ఫస్ట్ పార్ట్ ని నలభై ఐదు నిమిషాలకు పరిమితం చేసి ట్విస్ట్ ఇచ్చింది.

టోటల్ ఎపిసోడ్ అత్యద్భుతం అని వర్ణించడానికి కాదు కానీ చాలా లైట్ మూమెంట్స్ తో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిందనే చెప్పాలి. అన్నిటికంటే హై లైట్ గా నిలిచింది చరణ్ ప్రభాస్ ల మధ్య ఫోన్ సంభాషణ. త్వరలో డార్లింగ్ గుడ్ న్యూస్ చెబుతాడని చరణ్ చెప్పడం. దానికి బదులుగా ప్రభాస్ ఒరేయ్ ఒరేయ్ అంటూ ఆపాయ్యంగా శత్రువులా సంబోధించడం ఆహ్లాదకరంగా అనిపించాయి. ఇద్దరి మధ్యలో బాలయ్య ఎనర్జీ సరేసరి. నీ జీవితంలో మేడం ఎవరూ అంటూ ప్రభాస్ ని బాలకృష్ణ టీజ్ చేయడం పేలింది. కృతి సనన్ ప్రస్తావన నేరుగా వచ్చింది కానీ అనుష్క పేరుని డైరెక్టర్ గా తీసుకురాకపోయినా గుర్తు వచ్చేలా చేశారు. ప్రభాస్ మాత్రం అన్నీ నవ్వుతూనే కొట్టేశాడు.

ప్రభాస్ సినిమాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇందులో బయట పడ్డాయి. మిస్టర్ పర్ఫెక్ట్ రీ షూట్ కి కారణాలు, వర్షంని లక్ష్మినరసింహ అంజిల మధ్య ఎందుకు రిలీజ్ చేశారనే అంశం, ఛత్రపతి చేసే టైంలో రెబెల్ మిర్చిలకు రాజమౌళి ఎలా ఒప్పుకున్నాడు. ఫార్మ్ హౌస్ తాలూకు సంగతులు, బాగా ఇష్టమైన ఇద్దరు కల్ట్ దర్శకులు ఎవరు, శృతి హాసన్ బాలయ్య గురించి చెప్పిన అభిప్రాయం, గుంపుగా ఉన్న సీన్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రభాస్ కు ఎదురయ్యే బలహీనత ఇలా ఒక్కొక్కటిగా డార్లింగ్ కూల్ గా సమాధానం ఇస్తూ వెళ్ళాడు. పెళ్లి గురించి టాపిక్ మాత్రం ప్రతిసారి తప్పించుకుంటూనే ఉన్నా బాలయ్య వదల్లేదు.

ఇలాంటి టాక్ షోలను ఏదో ప్యాన్ ఇండియా రేంజ్ లో ఊహించుకోలేం కాబట్టి ఉన్నంతలో చక్కని బాండింగ్ తో ఒక సీనియర్ జూనియర్ మధ్య జరిగిన సంభాషణగా ఇంటరెస్టింగ్ గానే సాగింది. మరీ ఎక్కువ హైప్ పెంచేసుకుని కనివిని ఎరుగని కొత్తవి వింటామని చూస్తామని అనుకుంటే మాత్రం అలాంటి ట్విస్టులు ఏమీ లేవు. గోపీచంద్ రావడం ఇద్దరూ కలిసి ముచ్చటించుకోవడం ఇవన్నీ జనవరి 6న రాబోయే రెండో భాగంలో పెట్టడంతో ఈసారికి బాలయ్య ప్రభాస్ లతోనే సర్దుకోవాల్సి వచ్చింది. పరస్పరం డార్లింగ్ అని పిలుచుకుంటూ సిగ్గరి అయిన ప్రభాస్ కలిసిపోయిన తీరు ఆకట్టుకుంది. ఇది ఎంత హిట్టో చెప్పాలంటే వచ్చేవారం మొత్తం చూసేదాకా ఆగాల్సిందే.