Agnyaathavaasiత్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన “అజ్ఞాతవాసి” ఫలితం ఏమిటో బయటకు వచ్చేసింది. పవర్ స్టార్ అభిమానులతో సహా సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఈ సినిమాపై పెదవి విరవడంతో, తొలి రోజే ఆన్ లైన్ లో టికెట్లు చాలా ఫ్రీగా దొరికే పరిస్థితి నెలకొంది. నిజానికి ఇది ఒక్క “అజ్ఞాతవాసి”కే ఎదురుకాలేదు. ఇటీవల విడుదలైన పెద్ద సినిమాలకు డివైడ్ టాక్ రావడం… అప్పటివరకు హౌస్ ఫుల్స్ తో టికెట్లు లభ్యం కాని అదే ఆన్ లైన్ లో మళ్ళీ టికెట్లు ప్రత్యక్షం అవడం… అనేవి చాలా రొటీన్ గా జరుగుతూ వస్తున్నాయి. ఇందుకు ‘అజ్ఞాతవాసి’ కూడా ఏమీ మినహాయింపు కాదని నిరూపించింది.

త్రివిక్రమ్ – పవన్ కాంబో సినిమాకు ఇంత డిజాస్టర్ టాక్ వస్తుందని ముందుగా అంచనా వేసింది కాదు. దీంతో తొలి రోజు ఏదో ఓపెనింగ్స్ తో గట్టెక్కినా, రెండవ రోజు నుండి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి తోడు తొలి రోజు సాయంత్రం సమయానికే ఆన్ లైన్ లో “అజ్ఞాతవాసి” సినిమా పైరసీ లింకులు ప్రత్యక్షం కావడం అనేది, సినిమా పరిస్థితిని మరింత దిగజారుస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మరి ఇక్కడ నుండి ‘అజ్ఞాతవాసి’ పుంజుకోవాలంటే అది పూర్తిగా ఒకే ఒక్కరి మీద ఆధారపడి ఉంది. ఆయన మరెవరో కాదు… మరో రెండు రోజుల్లో ధియేటర్లలోకి రాబోతున్న నందమూరి నటసింహం..!

కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేసిన “జై సింహా” సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు. ట్రైలర్స్ కూడా సినిమాపై ఏ మాత్రం నమ్మకాన్ని కలిగించలేకపోయాయి. అంచనాలు లేవు గనుక ఏ కొంచెం బాగున్నా, ఖచ్చితంగా పాజిటివ్ టాక్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా పవన్ సినిమా మాదిరే భారీ నెగటివ్ వస్తే, సంక్రాంతి పండగ సీజన్ వరకు బాలయ్య “అజ్ఞాతవాసి”ని రక్షించవచ్చు. తన సినిమాకు వచ్చిన దారుణమైన టాక్ తో ప్రస్తుతం పక్క సినిమాపై ఆధారపడే పరిస్థితికి పవన్ కళ్యాణ్ మూవీ చేరుకుంది. మొత్తానికి ‘జల్సా, అత్తారింటికి దారేది’ సినిమాల తర్వాత హ్యాట్రిక్ కొడుతుందని భావించిన “అజ్ఞాతవాసి” చతికిలపడిపోయింది.