Agnyaathavaasi-Movie--Victory-Venkatesh-Cameo158 నిముషాల నిడివి గల “అజ్ఞాతవాసి” సినిమాలో బోరింగ్ సన్నివేశాలను కట్ చేసి, శనివారం నాటి నుండి విక్టరీ వెంకటేష్ నటించిన సన్నివేశాలను ప్రదర్శించనున్నారు. దీనిపై అధికారిక వార్త రావడంతో, పండగ సెలవుల్లో అయినా ‘అజ్ఞాతవాసి’ కాస్త నష్టాలను పూడ్చుకుంటుందా? అన్నది వేచిచూడాల్సిన అంశం. ఈ సినిమా తీరుగా చెప్పాలంటే… ప్లాన్ ఎ అడ్డంగా బెడిసికొట్టడంతో, త్రివిక్రమ్ ప్లాన్ బిని అమలు చేస్తున్నారని చెప్పాలి. అందుకే రంగంలోకి విక్టరీ వెంకటేష్ దిగబోతున్నాడు.

అంతా బాగానే ఉంది… అయితే బోరింగ్ సన్నివేశాలను కట్ చేస్తాము అని చెప్పిన సమాచారంలో… సినిమాలో ఎంత నిడివిని తొలగిస్తారో చెప్పలేదు. ఎందుకంటే… పాటలు, ఫైట్లు తీసేస్తే దాదాపుగా ఉన్న రెండు గంటల సినిమాలో ఒక గంటన్నర్రకు పైగానే ప్రేక్షకులకు బోర్ కొట్టే సన్నివేశాలు ఉన్నాయి. ఇంత పుష్కలంగా ఉంచుకున్న బోరింగ్ సన్నివేశాలను ఎన్నింటిని త్రివిక్రమ్ తొలగిస్తారో గానీ, ప్రస్తుతం భారమంతా వెంకటేష్ పైనే పడింది. దీనికి సంబంధించి వెంకటేష్ డబ్బింగ్ చెప్తోన్న ఓ వీడియోను కూడా విడుదల చేసారు.

అయితే ఇంత దారుణమైన సినిమాలో మళ్ళీ విక్టరీ వెంకటేష్ ఎందుకు? ఆయన ప్రతిష్ట కూడా తగ్గించడానికా? అంటూ వెంకీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ భావాలను వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే… సినిమా తెరకెక్కించిన విధానంతో, వెంకటేష్ కాదు, మహేష్ బాబు ఉన్నారని సీన్స్ జోడించినా “అజ్ఞాతవాసి”ని ఎవరూ రక్షించలేరన్న స్పష్టత వచ్చేసింది కనుక, మళ్ళీ వెంకీ సీన్లు జోడించడం ఎందుకు? అనే ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. బొమ్మను బ్లాక్ బస్టర్ చేయకపోయినా, కనీసం నష్టాలను తగ్గించడంలో అయినా వెంకీ దోహదపడొచ్చు కదా!