Agnyaathavaasi - disaster talkపవర్ స్టార్ అభిమానులు ఎన్నాళ్ళుగానో వేచిచూసిన “అజ్ఞాతవాసి” బొమ్మ వెండితెరపై పడింది. ‘జల్సా – అత్తారింటికి దారేది’ వంటి రెండు బ్లాక్ బస్టర్స్ బ్యాక్ బోన్ లో ఉన్న కాంబో కావడంతో, సహజంగా “అజ్ఞాతవాసి”పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరి ఆ అంచనాలను అందుకుందా? అంటే సినిమా చూసిన ప్రేక్షకుడు పవన్ కళ్యాణ్ అభిమాని అయితే మొహమాటం మీద ‘పర్లేదు’ అని చెప్పడానికి ఆస్కారం ఉందేమో గానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిమాని అయితే గనుక పూర్తిగా నిరుత్సాహపడక తప్పదన్న ‘ఫస్ట్ టాక్’ బయటకు వచ్చింది.

ముందుగా పడిన యుఎస్ ప్రీమియర్స్ నుండే కాకుండా, వేకువజామునే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పడిన బెనిఫిట్ షోల నుండి కూడా ఇదే రకమైన టాక్ రావడంతో, ఉదయాన్నే పవన్ ఫ్యాన్స్ కు షాక్ తగిలినట్లయ్యింది. ముఖ్యంగా ఎవరి మీద అయితే పవన్ అభిమానులు, సాధారణ సినీ ప్రేక్షకులు నమ్మకం పెట్టుకున్నారో, ఆ త్రివిక్రమ్ ఈ “అజ్ఞాతవాసి”కి హైలైట్ కావడం విశేషం. సినిమా మొత్తమ్మీద క్లైమాక్స్ డైలాగ్ లు, ఒకటి, రెండు చోట్ల ఎలివేట్ చేసే సన్నివేశాలు, అన్నింటికీ మించి అద్భుతమైన నిర్మాణ విలువలు మినహాయిస్తే… చెప్పుకోవడానికి ఏమీ లేకపోగా, ఫైనల్ త్రివిక్రమ్ కార్నర్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.

ఎందుకంటే… ‘అజ్ఞాతవాసి’ అనే సినిమా ‘లార్గో వించ్’ అనే ఫ్రెంచ్ మూవీకి ‘ఫ్రీమేక్’గా తెరకెక్కించడం ఖచ్చితంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ లో మాయని మచ్చగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు. కేవలం ఆ సినిమా ‘ప్లాట్’ మాత్రమే తీసుకోకుండా, క్లైమాక్స్ తో సహా చాలా సన్నివేశాలు మక్కికి మక్కి దించేయడం అనేది గురూజీ నుండి ఊహించనిది కాకపోవడంతో, ఖచ్చితంగా విమర్శలకు అవకాశం ఇచ్చినట్లయ్యింది. గతంలో కూడా త్రివిక్రమ్ మీద ‘కాపీ కాట్’ అనే ముద్ర ఉన్నప్పటికీ, అది కేవలం సీన్స్ వరకే పరిమితం కాగా, ‘అజ్ఞాతవాసి’కి వచ్చేపాటికి మొత్తం సినిమానే కాపీ చేయడం విశేషం.

నిజానికి ‘లార్గో వించ్’ సినిమాను మక్కికి మక్కి మొత్తం రీమేక్ చేసినా వర్కౌట్ అయ్యేదేమో! కానీ అనవసరమైన కామెడీ, వర్కౌట్ కానీ హీరోయిన్ల రొమాంటిక్ సన్నివేశాలతో… మొత్తం ‘కిచిడి’గా మార్చేసి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించారు. ఆహ్లాదకరమైన హాస్యాన్ని పండించడంలో ‘కింగ్’ అయిన త్రివిక్రమ్ సినిమాలో కామెడీ పండకపోవడం అసలు హైలైట్ గా మారింది. నిజానికి ‘అత్తారింటికి దారేది’ సినిమా సెకండ్ హాఫ్ లోనే కామెడీ వర్కౌట్ కాలేదు, కానీ అక్కడ పైరసీ సెంటిమెంట్ వర్కౌట్ కావడంతో, అది సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. విశేషం ఏమిటంటే… ‘లార్గో వించ్’ ఒరిజినల్ డైరెక్టర్ కూడా “అజ్ఞాతవాసి”ని చూసి, ఇది తమ సినిమానే కదా అని విచారం వ్యక్తం చేసారు.