Agneepath scheme central governmentత్రివిద దళాల నిర్వహణ భారం తగ్గించుకొనేందుకు కేవలం నాలుగేళ్ళ సర్వీసుతో కేంద్రప్రభుత్వం అగ్నిపథ్‌ అనే కొత్త ఉద్యోగ నియామక విధానం ప్రకటించింది. దానిపై నిన్న దేశవ్యాప్తంగా ఊహించని స్థాయిలో నిరసనలు, విధ్వంసం జరిగింది. వీటికి ప్రతిపక్షాలే కారణమంటూ కేంద్రం రాజకీయ రంగు పులిమింది. నిన్న జరిగిన అల్లర్ల వెనుక రాజకీయ పార్టీలు లేవు. కానీ అల్లర్లు మొదలైనప్పటి నుంచి అన్ని రాజకీయ పార్టీలు కేంద్రం వైఖరిని ఖండిస్తూ, నిరసనకారులకు మద్దతుగా మాట్లాడటం మొదలుపెట్టాయి. కనుక ఇక నుంచి దేశంలో ప్రతిపక్షాలు వారి ఆందోళనలకు నిజంగానే మద్దతు తెలపడం తధ్యం.

ఇప్పటికే మోడీ ప్రభుత్వం సీఏఏ, వ్యవసాయ చట్టాలతో దేశంలో ముస్లింలు, రైతుల ఆగ్రహాన్ని చవి చూసింది. ఆ రెంటి విషయంలో కేంద్రప్రభుత్వం ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ మళ్ళీ వివాదాస్పదమైన ఈ అగ్నిపథ్‌ పధకం ప్రకటించి దేశవ్యాప్తంగా యువత ఆగ్రహానికి గురవుతోంది.

దీంతోనే బిజెపిని రాజకీయంగా దెబ్బ తీసేందుకు దేశంలోని ప్రతిపక్ష పార్టీలకు కేంద్రప్రభుత్వం గొప్ప ఆయుధాన్ని అందజేసినట్లయింది. కేంద్రప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న యువతను ప్రతిపక్ష పార్టీలు ఆకర్షించే ప్రయత్నాలు తప్పక చేస్తాయి. దేశంలో లక్షలాది యువత, వారి కుటుంబాలు ప్రతిపక్షాలవైపు మొగ్గితే ఎన్నికలలో నష్టపోయేది బిజెపియే.

ముఖ్యంగా తెలంగాణలో బిజెపి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న టిఆర్ఎస్‌ పార్టీ ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితులలో వదులుకోదు. ఇప్పటికే కేంద్రప్రభుత్వ వైఖరిని రోజూ ఎండగడుతోంది. ఇప్పుడు చేతికి అందివచ్చిన ఈ అగ్నిపథ్‌ అస్త్రాన్ని కేంద్రం, బిజెపిలపైనే గురిపెట్టడం తధ్యం. కనుక కేంద్రప్రభుత్వం దీనిపై పునరాలోచన చేస్తే బిజెపికి మంచిది.