hyerabad_rains‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టయ్యింది’ హైదరాబాద్ లోని లోతట్టు కాలనీల్లోని ప్రజల పరిస్థితి. రెండు రోజుల నాటి భారీ వర్షానికి చెరువుల కట్టలు తెగి దాదాపు 1000 అపార్టుమెంట్లలోకి చేరిన నీరు ఇంకా పూర్తిగా బయటకు వెళ్లనే లేదు, అంతలోనే నేటి మధ్యాహ్నం నుండి మళ్ళీ వర్షం మొదలైంది. దీంతో విశ్వనగరం వాసులు వాన నీటితో బెంబేలెత్తిపోతున్నారు.

నాంపల్లి, కోటి, సైదాబాద్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్, కూకట్ పల్లి, బాలానగర్, బోయిన్ పల్లి, జీడిమెట్ల, ఖైరతాబాద్, ఎస్సార్ నగర్, ఎర్రగడ్డ, కుషాయిగూడ, ఈసీఐఎల్, మల్కాజ్ గిరి, లాలాపేట, తార్నాక, ఉప్పల్, సరూర్ నగర్, బంజారాహిల్స్, మాదాపూర్, చార్మినార్, చంపాపేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో మరోసారి రోడ్లపైకి నీరు చేరగా, ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించింది.

ఈ వర్షపు నీటిలో అధికభాగం ఇప్పటికే నిండుకుండగా ఉన్న హుస్సేన్ సాగర్ కు చేరుతుండగా, ఔట్ ఫ్లోను పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. హుస్సేన్ సాగర్ నీరు లుంబినీ పార్కులోకి చొచ్చుకొచ్చింది. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు, ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యలకు కూడా వర్షం అడ్డు తగుతులుతుండడంతో తలలు పట్టుకోవడం అధికారుల వంతవుతోంది.