After Katamarayudu Pawan Kalyan Anantapur Padayatraగతేడాది నవంబర్ 10వ తేదీన అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తాను ఇక్కడ నుండే పోటీ చేస్తానని స్వయంగా పవన్ ధృవీకరించిన విషయం తెలిసిందే. అలాగే ఈ సందర్భంగా మరో విషయాన్ని కూడా చెప్తూ… త్వరలోనే ఈ జిల్లాలో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. అయితే ఆ తర్వాత ‘కాటమరాయుడు’ సినిమాను పూర్తి చేసే పనిలో పడిన పవర్ స్టార్, ఇపుడు ఆ సినిమా విడుదల కావడంతో పాదయాత్రకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ ను సిద్ధం చేయాలని పవన్ పలువురిని నియమించగా, తాజాగా ఆ రూట్ మ్యాప్ కూడా సిద్ధమైందని సమాచారం. పవన్ పాదయాత్ర చేయనున్న మార్గాన్ని పరిశీలించేందుకు రెండు మూడు రోజుల్లో ఆ పార్టీ పరిశీలకులు అనంతపురం జిల్లాకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో పవన్ పాదయాత్ర కళ్యాణదుర్గం నుంచి ప్రారంభమై మడకశిర, పెనుకొండ, గోరంట్ల, పుట్టపర్తి, ధర్మవరం మీదుగా అనంతపురం వరకు కొనసాగనుందని, అలాగే యాత్ర ముగింపు సందర్భంగా అనంతపురంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు.

ఒక్క రూట్ మ్యాప్ పరిశీలన పూర్తి కాగానే, దీనికి సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా విడుదల చేయనున్నారు. వీటితో పాటే ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడు ముగుస్తుంది? ఏయే తేదీలలో ఎక్కడెక్కడ పర్యటిస్తారు? అనే పూర్తి సమాచారాన్ని అందజేస్తారు. ఓ పక్కన సినిమాలు చేస్తూనే పవన్ రాజకీయంగా కూడా యాక్టివ్ కావడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అందులోనూ ప్రస్తుతం ‘కాటమరాయుడు’ హంగామాతో ఉన్న ఫ్యాన్స్ కు, పాదయాత్ర ప్రారంభిస్తే అంతకుమించిన పండగ ఉంటుందా..!