Afghanistan cricketer Rashid Khan to break world recordఅంతర్జాతీయ క్రికెట్‌లో సంచలనాలు నమోదు చేస్తున్న ఆఫ్ఘనిస్థాన్ యువ స్పిన్నర్ రషీద్ ఖాన్ మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా మంగళవారం యూఏఈతో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన రషీద్ ఐదు వికెట్లు పడగొట్టడంతో, అతడి ఖాతాలో 96 వికెట్లు చేరాయి.

కేవలం 42 వన్డేల్లోనే 96 వికెట్లు నేలకూల్చిన రషీద్ ఖాన్ వంద వికెట్ల మైలురాయికి అత్యంత చేరువలో ఉన్నాడు. మిగతా నాలుగు వికెట్లు సాధిస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా వంద వికెట్లు తీసుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా 19 ఏళ్ల ఈ మిస్టరీ స్పిన్నర్ రికార్డులకెక్కనున్నాడు.

గతంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ 52 వన్డేల్లో 100 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. రషీద్ ఈ టోర్నీలో ఇప్పటికే 15 వికెట్లు సాధించగా, వరల్డ్ రికార్డు సృష్టించడానికి ఇంకా చేతిలో 10 మ్యాచ్ లు ఉండగా, రికార్డును సాధించడానికి కేవలం 4 వికెట్ల దూరంలో ఉండడంతో, ప్రపంచ రికార్డు రషీద్ సొంతం కావడం ఖాయం.