Adipurush Teamసోషల్ మీడియా వచ్చాక ఎలాంటి పైత్యమైనా ప్రదర్శించుకోవడానికి వేదిక దొరికింది. ఎలాగూ ఫేక్ ఐడిలు. ఎవరేమంటున్నారో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో గుర్తు పట్టే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోవచ్చు. ఆదిపురుష్ నిర్మాతలు ప్రతి షోకి హనుమంతుడి కోసం ఒక సీట్ ని ఖాళీగా వదులుతామని, శ్రీరాముడు ఎక్కడ ఉంటే అక్కడ అంజనీసుతుడు ఉంటాడు కాబట్టి ఆ సెంటిమెంట్ ని పాటిస్తామని అన్నారు.

ఇప్పుడిది కొందరికి ట్రోలింగ్ అంశంగా మారిపోయింది. ఆంజనేయుడి పక్క సీట్లు బ్లాక్ లో అమ్ముతారని, అక్కడికెళ్లి దండాలు పెట్టుకుంటారని కామెడీలు చేస్తున్నారు. ముందో చిన్న లాజిక్ చూద్దాం. మన దేశంలో ఓ అయిదు వేల స్క్రీన్లలో ఆదిపురుష్ రిలీజ్ అనుకుందాం. మొదటి రోజు అయిదు షోల చొప్పున కనీసం పాతిక వేల ఆటలు పడతాయి.

యావరేజ్ గా టికెట్ కు నూట యాభై రూపాయలు వేసుకున్నా ఒక్క హనుమంతుడి సీట్ కోసం వదులుకుంటున్న మొత్తం అక్షరాలా 37 లక్షల 50 వేలు. పది రోజులకు ఎంతో చెప్పనవసరం లేదు. ఇది కేవలం నోటి లెక్క కోసం వేసిన షో కౌంట్. దీనికన్నా చాలా ఎక్కువే ఉంటాయి. ఈ డబ్బులు డిస్ట్రిబ్యూటర్ ద్వారా చివరికి చెల్లించాల్సింది నిర్మాతే. మార్కెటింగ్ అనుకున్నా మరొకటనుకున్నా ఇలాంటి పద్ధతులు తప్పేమీ కాదు.

లవకుశ టైంలో ఎన్టీఆర్ తెరమీద కనిపించినప్పుడు జనం హాలులోనే హారతులు పట్టేవారు. శ్రీ షిరిడిసాయిబాబా మహత్యం షోలకు ఆడియన్స్ చెప్పులు లేకుండా వెళ్ళేవాళ్ళని పెద్దవాళ్ళు చెబుతారు . అన్నమయ్య, అమ్మోరులకు ప్రసాదాలు పంచి పెట్టిన థియేటర్లున్నాయి. దేవుడికి సంబంధించిన ఒక ఎమోషన్ ని గాథ రూపంలో సినిమా ద్వారా చెబుతున్నప్పుడు ఇలా చేయడం తప్పేమీ కాదు. పైగా ఆదిపురుష్ పూర్తిగా రామాయణ కథ.

సినిమా బాగుంటుందా లేదానేది తర్వాత సంగతి. మతాలకు, కులాలకు ప్రాధాన్యం ఉన్న ప్రజాస్వామ్య దేశంలో రాముడికి సంబంధించిన ఒక చిన్న సెంటిమెంట్ మీద ఇంత ఆన్ లైన్ రగడ జరగడం విచిత్రమే. వందల కోట్లతో తీశారు కాబట్టి ఆదిపురుష్ కి అందరూ మద్దతు ఇవ్వాలన్న రూలేమీ లేదు. కానీ సదరు టీమ్ పాటిస్తున్న పద్దతుల పట్ల అభ్యంతరం ఎందుకనేదే ప్రశ్న.

భక్తుల భావోద్వేగాలు దెబ్బ తినే ప్రసక్తే లేనప్పుడు కేవలం ఒక్క సీట్ ఖాళీగా ఉంచడం వల్లే జరిగే పరిణామాలు ఊహించుకోవడం అనవసరం. దాని వల్ల దేశానికొచ్చిన నష్టం కానీ, ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ఇబ్బంది కానీ ఏమి లేదు. అలాంటప్పుడు ఎందుకీ రచ్చ. నిండుగా ఉన్న సముద్రంలోకి రాళ్లు విసిరేసి నీళ్లను కొడుతున్నామని ఆనందపడే వాళ్ళకు చెప్పడానికి ఏముంటుంది