Movie Re-Releasesరానురాను రీరిలీజులు జనానికి మొహం మొత్తేదాకా దాకా తెచ్చేశారు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ అడ్డుగా పెట్టుకుని డబ్బులు సంపాదించవచ్చనే ఆలోచన ఇప్పటికే పాతిక పైగా పాత సినిమాలను థియేటర్లకు తెచ్చి పెట్టింది. కొన్నిటిని అభిమానులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్వంత డబ్బులు వేసుకుని మరీ రికార్డులు చూపిస్తే మరికొన్ని నిజంగానే ఆడియన్స్ లో ఆసక్తి రేకెత్తించి టికెట్లు కొనేలా చేశాయి. అయినా సక్సెస్ శాతం తక్కువే.

నిజానికి ఎలాంటి పాత క్లాసిక్స్ ని చూడాలనే విషయంలో ఇప్పటి జనరేషన్ కు సరైన రీతీలో గైడ్ చేయడం అవసరం. ఈ చివరి వారంలో రెండు ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్స్ ని రీ మాస్టర్ చేసి విడుదల చేస్తున్నారు. వాటిలో మొదటిది 28న వస్తున్న అడవి రాముడు. యుఎస్ లో ఏరియాల వారిగా స్క్రీన్స్ లిస్టు వదిలేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్లాన్ చేస్తున్నారు. 1977లో రికార్డుల సునామి సృష్టించిన ఈ ఆల్ టీమ్ హిట్ గురించి పుస్తకాలే రాయొచ్చు. కమర్షియల్ జానర్ కి సరికొత్త నడకలు నేర్పించిన రాఘవేంద్రరావు నైపుణ్యానికి మెచ్చుతునక ఇది.

ఇక ఎన్టీఆర్ నటన గురించి పాటల్లో హుషారు గురించి చెప్పేదేముంది. ఇప్పటికీ ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి పాటకు కాలు కదపకుండా ఉంటుందా. రెండోది మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా వస్తున్న మోసగాళ్లకు మోసగాడు. టాలీవుడ్ కు కౌబాయ్ జానర్ ని తీసుకొచ్చిన ఘనత దీనికే చెందుతుంది. గుర్రాలు, నిధుల వేట ఇలాంటి సెటప్ లో తెలుగు సినిమాని చూసి అప్పటి ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు. పెట్టిన బడ్జెట్ కు పది రెట్లు లాభం తీసుకొచ్చింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకునే చిరంజీవి కొదమసింహం చేశారు.

స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ఉంటూ ఖరీదైన పాప్ కార్న్ తో మల్టీప్లెక్సులో సినిమా చూడటమే ఎక్స్ పీరియన్స్ గా ఫీలవుతున్న తరానికి అడవి రాముడు, మోసగాళ్లకు మోసగాడు లాంటివి బిగ్ స్క్రీన్ మీద చూపించాలి. ఇవే కాదు దానవీరశూరకర్ణ, ప్రేమాభిషేకం, అల్లూరి సీతారామరాజు, సంపూర్ణ రామాయణం లాంటివి మరెన్నో తీసుకురావాలి. మొన్నటి తరం సాధించిన ఘనతలు, అందించిన ఘనమైన సినీ సంపద ఎంతటి విలువైనవో ఇప్పుడు ఏం మిస్ అవుతున్నామో తెలుసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే పది పదిహేనేళ్ల క్రితం వస్తున్న సినిమాలకు కలెక్షన్ల పేరిట ఫ్యాన్స్ చేస్తున్న సంబరాలు సంతర్పణలు కొనసాగి చివరికి ఈ ట్రెండే చనిపోతుంది.