adala prabhakar reddy joins ysrcpనామినేషన్ల గడువు దగ్గర పడే కొద్ది వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వలసలు ఎక్కువ అవుతున్నాయి. గతంలో జగన్ తో విభేదించిన వారు కూడా పార్టీలోకి తిరిగి వస్తున్నారు. అయితే టీడీపీ నుండి వలస వచ్చిన చాలా మంది ఆ పార్టీలో టిక్కెట్ రాని వారే. అదే సమయంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి అయితే ఏకంగా టీడీపీ టిక్కెట్ తెచ్చుకుని కూడా లోటస్ పాండ్ లో వైకాపా కండువా కప్పేసుకున్నారు. దీనితో వలస పక్షులలో వైఎస్సార్ కాంగ్రెస్ మీద నమ్మకం ఎక్కువగానే ఉందని అనుకోవాలి.

సహజంగా ఏ పార్టీలోకి ఎక్కువ వలసలు ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని అనుకుంటారంతా. అయితే తెలుగుదేశం నాయకులు మాత్రం గెలుపు గురించి అంతే ధీమాగా ఉన్నారు. ఈ సారి అభ్యర్థులు కాదు తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమని గెలిపిస్తాయని వారు అంటున్నారు. వైఎస్ వివేకా హత్య కేసు, మంత్రాలయం టీడీపీ అభ్యర్థి మీద వైకాపా దాడి వంటి అంశాలు కూడా ఎన్నికల సమయంలో ప్రజల మీద ప్రభావం చూపించవచ్చని వారి అంచనా.

జగన్ ముఖ్యమంత్రి అయితే ఏమవుతుందో ప్రజలకి అర్ధమయ్యిందని దీనితో సామాన్యులు మరొక్కసారి చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలబడతారని వారి అంచనా. వైఎస్ వివేకా హత్యకేసు గనుక తేలి, అందులో కుటుంబసభ్యుల పాత్ర ఉందని తేలితే తమ గెలుపు నల్లేరుపై బండి నడకే అని వారు అభిప్రాయపడుతున్నారు. రెండు విడతల రుణ మాఫీ, చివరి విడత పసుపుకుంకుమ, రెండో విడత అన్నదాత సుఖీభవ పైసలు జమైతే పరిస్థితి తమకు పూర్తి అనుకూలంగా మారుతుందని చంద్రబాబు అంచనా. ఎవరి నమ్మకం నిజమవుతుందో తేలాలంటే మే 23వరకు ఆగాల్సిందే.