actress-dhanya-john-jacob-arrested-for-cheating-case-arrestరియల్ ఎస్టేట్ వ్యవహారంలో మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై దక్షిణాది సినీ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. 2006లో తమిళ సినిమా తిరుడి (దొంగ) చిత్రం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించిన నటి ధన్య, ఆమె భర్త జాన్ జాకబ్ కూడా పలు సినిమాల్లో నటించారు. అయితే, కేరళ రాజధాని తిరువనంతపురం పరిసరాల్లో నిర్మిస్తున్న నోవా కాజిల్ ఫ్లాట్ కాంప్లెక్స్ లో జాన్ జాకబ్ కు చెందిన సంస్థ ‘శాంసన్ అండ్ సన్స్’ ద్వారా కోట్లాది రూపాయలు కాజేశారనే ఫిర్యాదు మేరకు వాళ్లిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

వీరితో పాటు ధన్య తమ్ముడు శామ్యూల్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాన్ జాక్సన్ కు చెందిన సంస్థ తమిళనాడులోని నాగర్ కోయిల్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అపార్టు మెంట్లు కట్టిస్తామని చెప్పి ఒక్కో కస్టమరు నుంచి 40 లక్షల నుంచి 1 కోటి వరకు వీరు తీసుకున్నారు. ఆ విధంగా తీసుకున్న డబ్బు మొత్తం 100 కోట్లు ఉంటుంది. అయితే, అపార్టుమెంట్ విషయమై సదరు కస్టమర్లు ప్రశ్నిస్తుంటే వీరు ముఖం చాటేస్తున్నారు.

దీంతో, విసిగిపోయిన కస్టమర్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. కాగా, 2014 నుంచి ఈ కేసు వ్యవహారం నడుస్తోంది. ధన్య మామ జాకబ్ శాంసన్ ని పోలీసులు గతంలో అరెస్టు చేయగా, తాజాగా, జాన్ జాకబ్, ధన్యను పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. ఓ పక్కన సినీ రంగంలో విరివిగా సంపాదిస్తూనే, మరో పక్కన ఇలా మోసపూరితంగా డబ్బులు కూడబెట్టడాన్ని కస్టమర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి ఘటనల వలన సినీ పరిశ్రమకు కూడా చెడ్డ పేరు వస్తోందని సినీ వర్గీయులు కూడా వాపోతున్నారు.