Actor Suman to participate in 2019 electionsమరో రెండు సంవత్సరాలలో జరగనున్న 2019 సార్వత్రిక ఎన్నికలు జనాలకు కావల్సినంత కిక్ నిచ్చే విధంగా ఉంటాయన్న సంకేతాలు ఇప్పటికే స్పష్టమయ్యాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతుండడం దీనికి మరింత దోహదపడే అంశం. కేంద్రం విషయంలో మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు ప్రభావం, తదుపరి ఎన్నికలలో కీలకం కానుందన్న భావాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తూ… ఇది కాంగ్రెస్ కు పెద్ద వరంగా మారిందని స్పష్టం చేస్తున్నారు.

ఇక, రాష్ట్రానికి వచ్చేసరికి అధికారంలో ఉన్న టిడిపి – వైసీపీలకు తోడూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘జనసేన’ కూడా అడుగు పెడుతుండడంతో… 2019 ఎన్నికలు మంచి రసకందాయంలో పడ్డాయని చెప్పవచ్చు. సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో, పవన్ తో పాటు మరికొందరు ఆయన వెనుక నడుస్తారన్న టాక్ కూడా ఉన్నప్పటికీ, అది ఎంతవరకు కార్యరూపం సిద్ధిస్తుందో చెప్పలేం. అయితే పవన్ వెనుక కాకపోయినా, తానూ మాత్రం 2019 సార్వత్రిక ఎన్నికల బరిలో నిలుస్తానని ఒకప్పటి సూపర్ హీరో సుమన్ స్పష్టం చేసారు.

“బడుగులకు సేవ చేయడమే లక్ష్యంగా 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్టు” సుమన్ తెలిపారు. రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న ఉద్దేశంతోనే గత కొంత కాలంగా వెనుకబడిన తరగతుల వారు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని, నటుడిగా ఉంటే కొంత మందికి మాత్రమే సేవ చేసే అవకాశం ఉంటుందని, రాజకీయ బలం తోడైతే, మరింత మందికి సాయపడగలనన్న నమ్మకం తనకుందని అన్నారు. తనకు కొన్ని లక్ష్యాలున్నాయని, వాటిని నెరవేరుస్తామని హామీ ఇచ్చిన పార్టీ తరఫున బరిలోకి దిగుతానని అన్నారు.