Actor Suman, Actor Suman Controversy Comments, Actor Suman Annamayya Awards, Actor Suman Comments Annamayya Awards, Actor Suman About Annamayya Movie Awardsతెలుగు సినీ పరిశ్రమలో అవార్డుల విషయంలో అసంతృప్తి వ్యక్తపరచని హీరో లేరని చెప్పడంలో సందేహం లేదు. ఎప్పుడూ ఎవరో ఒకరు ఏదొక సందర్భంలో బహిరంగంగా తమ ఆవేదనను, అక్కసును బయట పెట్టినవారే. ఇలా పబ్లిక్ గా కొన్ని విషయాలు బయటకు వస్తుంటే… ఇక సినీ జనాలలో వారిలో వారికి జరిగే చర్చలు కోకొల్లలు అని చెప్పవచ్చు. అయితే, కొన్ని ప్రత్యేకమైన సినిమాలకు సంబంధించి ప్రజలలో ఇప్పటికీ కొన్ని ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి.

‘అల్లూరి సీతారామరాజు’ పాత్రకు కృష్ణ గారికి అవార్డు రాకపోవడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయమని ఒకానొక సమయంలో ప్రిన్స్ చెప్పిన విషయం తెలిసిందే. అలాగే ‘అన్నమయ్య’ సినిమాలో తానూ వేసిన శ్రీవేంకటేశ్వరుని పాత్రకు అవార్డు రాకపోవడంపై కూడా తాజాగా సుమన్ ఆవేదన వ్యక్తం చేసారు. అంతేకాదు, ఇక తానూ జీవితంలో శ్రీవెంకటేశ్వరుని పాత్రను పోషించబోనని నిర్వేదంతో కూడిన వ్యాఖ్యలు చేసారు.

అన్నమయ్య చిత్రంలో నటించిన తరువాత, ప్రేక్షకులు తనను నిజంగానే వెంకన్న స్వామిలా భావించారని చెప్పిన సుమన్, తాను ఏం తప్పు చేశానని ఆ పాత్రను అవార్డుల సంఘాలు గుర్తించలేదని ప్రశ్నించారు. ఈ సినిమాను చూసిన అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ, తనను తీసుకురావాలని అడిగారని, ఆపై తన చేతులు పట్టుకుని డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకువెళ్లారని గుర్తు చేసుకున్నారు.

అన్నమయ్య చిత్రానికి పనిచేసిన వారిలో ఎందరికో అవార్డులు వచ్చాయని, తనలో లోపం ఏంటని ప్రశ్నించారు. రాజకీయాల్లోకి రావాలన్న కోరిక తనకు లేదని, సేవా కార్యక్రమాల్లో మాత్రం ఎప్పుడూ తన వంతు పాత్రను పోషిస్తానని సుమన్ చెప్పారు. ఓ సినిమా షూటింగ్ లో భాగంగా రాజమహేంద్రవరం విచ్చేసిన సుమన్ తన మనోభావాలను పంచుకున్నారు.