Actor-Sivaji-Andhra-Pradesh-Special-Status-BJP-attackఆంధ్రప్రదేశ్ కు బిజెపి ఒరగబెట్టింది ఏమీ లేదని విమర్శలు చేస్తూ… ‘మోడీ జీరో’ అంటూ ప్రముఖ మీడియా ఛానల్ చర్చలో పాల్గొన్న హీరో శివాజీపై బిజెపి నేతలు అనుచితంగా దాడి చేయడం విస్మయానికి గురి చేస్తోంది. ‘ప్రత్యేక హోదా’ చర్చలో భాగంగా… ప్రజలు ఇంకా సహనంతో బిజెపి నేతలను మాట్లాడిస్తున్నారని, ఇంకా ఎక్కువ మాట్లాడితే తరిమి కొడతారని బిజెపిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో… ఒక్కసారిగా శివాజీపై విరుచుకుపడ్డారు.

దీంతో పక్కనున్న ప్రజా సంఘాలు, ప్రజలు బిజెపి నేతలు అడ్డుకునే ప్రయత్నం చేసారు. ఇదే సమయంలో బిజెపిపై కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పద్మ కూడా విమర్శలు చేయగా, ఆమె పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేసారు. రాజకీయాలలో విమర్శలు సహజం. అందులోనూ ఏపీని అడ్డగోలుగా మోసం చేస్తోన్న బిజెపిని విమర్శించడంలో తెలుగు ప్రజలందరికీ హక్కు ఉంది. ఆ హక్కును అడ్డుకునే అధికారం ఎవరికీ లేదని బిజెపి సభ్యులు గుర్తించాలి.

శివాజీపై జరిగిన దాడి బిజెపి ఆలోచనా విధానాలకు అద్దం పడుతోంది. తమను తిరిగి ప్రశ్నిస్తే… రియాక్షన్స్ ఈ విధంగా ఉంటాయని చెప్పకనే చెప్తున్నారు. ఇలాంటి చర్యలు చేసే ప్రభుత్వాలను మట్టి కరిపించాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉంది, తెలుగు వారిపై అది ఇంకాస్త ఎక్కువగా ఉంది. అయితే ఈ దాడిపై మీడియా వర్గాలు కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం విశేషం. ఇదే దాడి ఏ పవన్ కళ్యాణ్ పైనో జరిగితే… ఊహకే అందని విధంగా రియాక్షన్స్ వచ్చి ఉండేవి. అంతేనా… ఈ పాటికి ఏపీలో “అగ్గి” రాజుకునేదని చెప్పావచ్చు.

ఇక్కడ పవన్ కళ్యాణా? శివాజీనా? అన్నది ముఖ్యం కాదు. ఏపీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎవరు మాట్లాడినా బిజెపి నేతల పద్ధతి ఇలాగే ఉంటుందని చెప్తున్నారా? అదే అయితే రేపు పవన్ కళ్యాణ్ ప్రశ్నించినా… ఇదే విధంగా రియాక్ట్ అయ్యే దమ్ము బిజెపి నేతలకు ఉందా? అభిమాన జనం లేరని, బ్యాక్ గ్రౌండ్ లో పెద్ద తలకాయ లేదని శివాజీపై దాడి చేయడం అనేది బిజెపి నేతల “పిరికితనాన్ని” సూచిస్తుందే తప్ప, మరేమీ కాదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ప్రజానీకం… తదుపరి ఎన్నికలలో బిజెపికి బుద్ధి వచ్చే విధంగా తీర్పు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా కనపడుతోంది.