Actor Sarath Babu Passed Awayసినిమా పరిశ్రమ పుట్టినప్పటి నుంచి కొన్ని వందల వేల ఆర్టిస్టులను చూసి ఉంటుంది. ప్రేక్షకులకు అందరూ గుర్తుండరు. ఇండస్ట్రీ సమానమైన పీఠ వేయదు. ముఖ్యంగా ఒక మనిషి పోయినప్పుడు అయ్యో అనుకున్నామంటే అతను ఖచ్చితంగా ఏదో సాధించినట్టే. శరత్ బాబుని ఆ కోవలోకే చేర్చవచ్చు. ఏడు పదుల జీవితాన్ని చవిచూసి అనారోగ్యంతో పోరు పడలేక ఇవాళ శాశ్వత సెలవు తీసుకున్నారు. తొంభై దశకపు ఆడియన్స్ లో శరత్ బాబు పేరు తెలియనిదెవరికి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పాత్రలు కొన్నున్నాయి.

సితారలో జమీందార్. కుటుంబ ప్రతిష్ఠ కోసం చేతిలో పైసా లేకపోయినా జనం దృష్టిలో పరువు నిలుపుకోవడం కోసం డాబు దర్పం నటించే పాత్ర ఇది. చెల్లెలు ఎవరో తక్కువ కులం వాడిని ప్రేమించిందని తెలుసుకుని చనిపోతాడు. శరత్ బాబు ఈ చిత్రంలో పరకాయ ప్రవేశం చేసిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. పైకి మంచి పోలీస్ ఆఫీసర్ గా కనపడుతూ లోపల అమ్మాయిల మీద కామంతో రగిలిపోయే క్యారెక్టర్ లో అన్వేషణ ఎంత గొప్పగా పండిందో మళ్ళీ గుర్తు చేయనవసరం లేదు. కోకిలలో సిబిఐ అధికారి మరో ఉదాహరణ.

అభినందనలో కార్తీక్ హీరో అయినప్పటికీ క్లైమాక్స్ లో ప్రేమ జంట కోసం ఆత్మహుతికి పాల్పడ్డ భార్యా వియోగుడిగా శరత్ బాబు నటన అమోఘంగా ఉంటుంది. సంసారం ఒక చదరంగంలో ఈయన్ని చూసి స్వార్థంతో నిండిన బిడ్డలను పోల్చుకున్న తండ్రులు ఎందరో. ఆపద్బాంధవుడు, స్వాతి చినుకులు, యమపాశం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలా పెద్దది. పాతికేళ్ళు నిండకుండానే రమాప్రభను పెళ్లి చేసుకోవడం ఎక్కువ కాలం కలిసుండకుండానే విడిపోవడం గురించి అప్పటి మీడియాలో కథలుగా వచ్చాయి.

వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెడితే మంచి రూపం చక్కని ప్రతిభ ఉన్న శరత్ బాబు తెలుగుతో పాటు తమిళం కన్నడలో ఎన్నో చిత్రాలు చేశారు. రెండు వందల యాభైకు పైగా సినిమాలున్నాయి. ముత్తు, అన్నామలైలో రజనీకాంత్ స్నేహితుడిగా ఈయన తప్ప ఇంకెవరు పండించలేనంత గొప్పగా వాటిలో ఒదిగిపోయారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో రెండు సీన్లలో మెప్పించారు. మళ్ళీ పెళ్లి చివరి చిత్రం కాబోతోంది. నటుడిగా శరత్ బాబు సంపాదించుకున్న గౌరవమే ఇవాళ ఇందరి జ్ఞాపకాల్లో ఆయన్ను సజీవంగా నిలిపింది.